ఏపీకి చెందిన జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఆనంది లీడ్ రోల్లో గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 17న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ ‘ఇలాంటి పాత్ర చేయడానికి నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా. ప్రీమియర్స్ చూసినవాళ్లంతా తెరపై గరివిడి లక్ష్మి పాత్ర మాత్రమే కనిపించిందని చెప్పారు. ఒక నటిగా అది నాకెంతో సంతృప్తినిచ్చింది’ అని చెప్పింది. తన కెరీర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ను ఇందులో చేశానని నటుడు రాగ్ మయూర్ చెప్పాడు.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ మూవీ షూటింగ్లో సగభాగం మా స్వస్థలం ఆదోనిలో చేశాం. మా సంస్థలో ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఇప్పటివరకు 15 సార్లు చూశా. ప్రతిసారి అదే ఎమోషన్ క్రియేట్ చేసింది. దసరా పండక్కి కచ్చితంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని నమ్ముతున్నాం. ఇక ప్రభాస్ గారితో కూడా ఒక సినిమా చేయబోతున్నాం’ అని చెప్పారు.
డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ చూసిన వాళ్లంతా తమను ఎమోషనల్ చేసిందని చెప్పడం సంతోషంగా ఉంది. గరివిడి లక్ష్మి పాత్ర విషయంలో ఆనందిపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకుంది’ అని చెప్పాడు. పాటను ప్రేమించిన ప్రతి కళాకారుడి హృదయంలో ఈ సినిమా నిలిచిపోతుంది అని మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ చెప్పారు.
