- ఎస్టీ అభ్యర్థులు లేక టీచర్స్, హెల్పర్స్ రిక్రూట్మెంట్లో జాప్యం
- మూడుసార్లు నోటిఫికేషన్..
- ఆ తర్వాత జనరల్ కేటగిరీలోకి..
- మంచిర్యాల జిల్లాలో 74 టీచర్, 467 హెల్పర్ పోస్టులు ఖాళీ
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఏజెన్సీ నియమాల కారణంగా పలు జిల్లాల్లో నియామకాలు నిలిచిపోయాయి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లోని పోస్టులను లోకల్ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించాల్సి ఉండగా.. వివిధ ప్రాంతాల్లో ఎస్టీలు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. చాలా జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ చేసి రిక్రూట్మెంట్లు చేపడుతున్నప్పటికీ మంచిర్యాలతో పాటు 10 జిల్లాల్లో మాత్రం నియామక ప్రక్రియకు బ్రేక్ పడ్డది. ఎస్టీలు లేని ఏజెన్సీ ఏరియాల్లోని పోస్టులను జనరల్ అభ్యర్థులతో నింపడానికి అనుమతి కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. ఈ మేరకు నిబంధనలను సడలిస్తే భవిష్యత్‌లో కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. మూడుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ అప్లికేషన్లు రాకపోతే ఆ పోస్టులను జనరల్ కేటగిరీగా పరిగణించి నియామకాలు చేపట్టే చాన్స్ ఉండడంతో ఈ ప్రతిపాదనకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో అంగన్వాడీల నియామకాలు ఆలస్యమవడంతో ఇంకా లేట్ చేయకుండా రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో మొత్తం 974 అంగన్వాడీ సెంటర్లకు గాను 74 టీచర్ పోస్టులు, 467 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మందమర్రి మున్సిపాలిటీ, కాసిపేట, తాండూర్, దండేపల్లి తదితర మండలాల్లోని పలు ఏజెన్సీ ఏరియాల్లో ఎస్టీ అభ్యర్థులు లేకపోవడం సమస్యగా మారింది. దండేపల్లి మండలం గూడెం గ్రామం ఏజెన్సీ పరిధిలో ఉండగా, ఇక్కడ ఎస్టీ కుటుంబాలు నివాసం ఉండడం లేదు. గూడెం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ కావడంతో మూడున్నర దశాబ్దాలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిలిచిపోవడం తెలిసిందే. తాండూర్ మండలం రేచిని, అబ్బాపూర్ సహా జిల్లావ్యాప్తంగా సుమారు 12 అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ఎస్టీ అభ్యర్థులు లేరని అధికారులు చెబుతున్నారు. టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో పాటు లోకల్ క్యాండిడేట్లు మాత్రమే అర్హులు. కాగా, ఫస్ట్ ఫేజ్‌లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులతో పాటు ఏజెన్సీ పరిధిలోని 62 హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన 405 హెల్పర్ పోస్టులను సెకండ్ ఫేజ్‌తో భర్తీ చేయనున్నట్టు సమాచారం.
