సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ వారసురాలు, ఎస్ఆర్హెచ్ (SRH) సీఈఓ కావ్య మారన్ వివాహం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను స్వయంగా కలిసి వివాహనికి ఆహ్వానిస్తున్నారు.
గ్రీస్ లో వెైభంగా పెళ్లి..
అనిరుధ్ , కావ్యల వివాహం నవంబర్ 11, 2026న గ్రీస్లో అత్యంత వైభవంగా జరగనుంది. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. టాలీవుడ్, కాలీవుడ్ మొదలుకొని దేశవ్యాప్తంగా సినీ, క్రికెట్ వర్గాల్లో ఈ పెళ్లి గురించే హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నెట్టింట ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. మరో వైపు వీరిద్దరి ఆస్తులపై కూడా లెక్కలు కడుతున్నారు.
అనిరుధ్ ఆస్తి రూ.100 కోట్లా?
'3' సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రజనీకాంత్, విజయ్, అజిత్ కుమార్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'జైలర్', 'విక్రమ్', 'జవాన్' వంటి చిత్రాల్లో ఆయన సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 'జైలర్ 2'తోనూ ఆయన పేరు వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ ఆస్తి విలువ సుమారు రూ. 100కోట్ల పైనే ఉంటుందని అంచనా . సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లైవ్ కాన్సర్ట్ లు , ఇతర సంగీత ప్రాజెక్టులు ఆయనకు ప్రధాన ఆదాయ వనరులు. అయితే అనిరుధ్ అసలు సంపదపై అధికారిక ఆర్థిక వివరాలు తెలియాల్సి ఉంది.
వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలిగా కావ్య..
కావ్య మారన్ పేరు ఐపీఎల్ సీజన్లో ప్రత్యేకంగా వినిపిస్తుంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన ఆమె, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పాటు కుటుంబ మీడియా వ్యాపారంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె వ్యక్తిగత ఆస్తి రూ. 450 నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక తండ్రి కళానిధి మారన్ సంపద సుమారు రూ.24,600 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. సన్ టీవీ నెట్వర్క్ ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక భాగం. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కూడా మారన్ కుటుంబానికి చెందిన ప్రధాన క్రీడా ఆస్తుల్లో ఒకటి.
వందల కోట్ల జోడీ..
ఈ లెక్కన ప్రస్తుతం అనిరుధ్, కావ్య వ్యక్తిగత సంపద కలిపి రూ. 600 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఈ ప్రేమ జంట 'జైలర్ 2' ప్రదర్శన సందర్భంగా ఇద్దరూ ఒకే థియేటర్లో కనిపించడం వార్తల్లో నిలిచారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి అధికారిక ఖారారు కావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
