మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, అంతు చిక్కని రహస్యాలు. తెలిసింది గోరంత.. తెలియనిది కొండంత అన్నట్లు మానవ అన్వేషణ కొనసాగుతోంది. కంటికి కనిపించని గాలిలో ఎన్నో అవశేషాలు, మూలకాలు ఉన్నట్లే.. కాళ్ల కింద ఉన్న మట్టి కింద.. గొయ్యి ఉందా.. సొరంగం ఉందా.. నది ఉందా, సముద్రం ఉందా.. తెలియని పరిస్థితి. అది తెలిసిన నాడు నోరెళ్లబెట్టడం తప్ప ఏమీ చేయలేం. అలాంటి విచిత్రమైన మిస్టరీనే ఈ స్వర్గపు గొయ్యి. భూమి లోపల, సూర్య రశ్మి లేకుండా పెరిగే అడవి.. అక్కడ కొత్త కొత్త జీవజాతులు మానవ అన్వేషణను.. చరిత్రకు సవాళ్లను విసురుతున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఇంటి బాల్కనీలో పెట్టిన మొక్కలకే నాలుగు రోజులు వెలుతురు తగలకపోతే వాడిపోతాయి. సరైన గాలి, వెలుతురు లేని భూగర్భంలో మొక్కలు పెరుగుతాయా? కానీ.. ఇక్కడ పెరిగాయి. అది కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఒక అడవే పెరిగింది. చైనాలో 630 అడుగుల ఒక సింక్ హోల్ (బిలం)లో చెట్లు పెరిగినట్టు గుర్తించారు సైంటిస్ట్ లు . అది కూడా చిన్న చిన్న మొక్కలు కాదు.. దాదాపు 131 అడుగుల పొడవైన చెట్లు పెరిగాయి.
దక్షిణ చైనాలోని లేయే కౌంటీలోని పింగ్ గ్రామ సమీపంలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్ లో కొన్ని సింక్ హోల్స్ కనుగొన్నారు. కొందరు స్పెలియోలజిస్ట్ లు (గుహలపై రీసెర్చ్ చేసేవాళ్లు) కొత్త కేవ్స్ కోసం ఆ ప్రాంతంలో వెతుకుతుండగా కొన్ని కార్డ్స్ సింక్ హోల్స్ కనిపించాయి. దాంతో చైనా, యూకే, ఫ్రాన్స్ కు చెందిన ఒక సైంటిస్ట్ ల టీం అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేసింది.
వాళ్లు అక్కడ మొత్తం 30 కొత్త సింక్ హోల్స్ లు కనుగొన్నారు. వాటిలో ఒకటి చాలా పెద్దగా ఉంది. అందులోకి వెళ్లి చూస్తే.. దట్టమైన పొదలు, ఏపుగా పెరిగిన చెట్లు కనిపించాయి. అది చూసిన సైంటిస్ట్ లు ఆశ్చర్యపోయారు.
- చాలా పెద్దది
మే 6న కొంతమంది సైంటిస్ట్ లు ఆ సింక్ హోల్ లోపలికి వెళ్లారు. అది దాదాపు 190 మీటర్ల (630 అడుగులు) లోతు ఉంది. కొన్ని వందల మీటర్ల పొడవు, వెడల్పుతో విస్తరించి ఉంది. 'జిన్హువా' అనే చైనా వార్తా సంస్థ... ఆ హోల్ సెయింట్ లూయిస్ గేట్ వే ఆర్చ్ (192 మీటర్ల ఎత్తు)ని కూడా మింగగలిగేంత పెద్దగా ఉందని చెప్పింది. అంటే అది ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ హోల్ రీసెర్చ్ చేసిన స్పెలియోలజిస్టులు.. దానికి మూడు ఎంట్రన్స్ లు ఉన్నాయని చెప్పారు. అందులో దాదాపు 131 అడుగుల (40 మీటర్లు) పొడవున్న పురాతన చెట్లు ఉన్నాయని, వాటి కొమ్మలు సూర్యరశ్మి పడిన వైపు మాత్రమే పెగిగాయని చెప్పారు.
ఈ హోల్లో కొంత భాగం సూర్యకాంతి కూడా పడుతోంది. ప్రస్తుతం ఈ హోల్ పై "ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్స్ట్ జియాలజీ ఆఫ్ ది చైనా జియోలాజికల్ సర్వే"రీసెర్చ్ చేస్తోంది. అయితే... ఈ సింక్ హోల్స్ ని కనుగొన్న టీం ఇదివరకే వాయువ్య చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో డజన్ల కొద్ది సింక్ హోల్స్ ని కనుగొన్నారు. అంతకుముందే గ్వాంగ్జీలో ఒకదానితో మరొకదానికి సింక్ హోల్స్ కూడా కనిపెట్టారు.
- సింక్ హోల్స్ కి కేరాఫ్
"ఈ సింక్ హోల్స్ కనుగొనడం మంచి వార్తే. అయితే.. అంతగా ఆశ్చర్యపరిచే విషయమేం కాదు" అని యుఎస్లోని "నేషనల్ కేవ్ అండ్ కార్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్"(ఎస్సీకెఆర్ఎ) ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, గుహలపై రీసెర్చ్ చేసిన ఇంటర్నేషనల్ ఎక్స్ పర్ట్ జార్జ్ వేని అన్నాడు. ఆయన చెప్పినదాని ప్రకారం.. దక్షిణ చైనా కార్బ్ టోపోగ్రఫీకి నిలయం. సింక్ హోల్స్ , కొన్ని రకాల గుహలు బెడ్ రాక్ కరగడం ద్వారా ఏర్పడతాయి.
ఆమ్ల గుణాలు ఉండే వర్షపు నీరు నేల మీద ప్రవహించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ని గ్రహిస్తుంది. దాంతో ఆ నీళ్లు మరింత ఎసిడిక్ గా మారుతాయి. అలాంటి నీళ్లు బెర్రా రాక్ గుండా ప్రవహించినప్పుడు అది పగుళ్లకు దారి తీస్తుంది. దాంతో మెల్లిగా చిన్న చిన్న సొరంగాలు ఏర్పడతాయి. అవి కొన్నేండ్లకు గుహలుగా మారతాయి.
అవి పెరుగుతూ.. పెద్ద పెద్ద గుహలుగా ఏర్పడతాయి. అవి మరింత విస్తరించినప్పుడు సీలింగ్ బలహీనపడి కూలిపోతుంది. అలా భారీ సింక్ హోల్స్ ఏర్పడుతాయి. అయితే.. వాటి ఎత్తు, లోతులు ఆ ప్రాంతపు భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి చైనాలో అలా పెద్ద సింక్ హోల్స్ ఏర్పడడానికి కారణం అక్కడి పరిస్థితులే. వాస్తవానికి ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి వాటిపై నడుస్తుంటారు. కానీ.. వాళ్ల కాళ్ల కింద అలాంటి ఒక కార్ప్ ఉందని తెలియదు.
- యునెస్కో గుర్తింపు
గ్వాంగ్జీ ప్రాంతంలో అద్భుతమైన సింక్ హోల్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ సింక్ హోల్స్ నుంచి రాతి స్తంభాల వరకు ఎన్నో నేచురల్ వండర్స్ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. “ఇప్పుడు కనుగొన్న ఈ సింక్ హోల్స్ లోపలి భాగం 1,004 అడుగుల (306 మీ) పొడవు, 492 అడుగుల (150 మీ) వెడల్పు ఉంది. ఇలాంటి సింక్ హోల్స్ ని “టియాంకెంగ్" అని పిలుస్తుంటారు. మాండరిన్ భాషలో టియాంకెంగ్ అంటే “స్వర్గపు గొయ్యి" అని అర్థం.
ఈ సింక్ హోల్స్ అడుగు భాగంలో మరో ప్రపంచం ఉన్నట్టు అనిపించింది” అని “ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్స్ట్ జియాలజీ"కి చెందిన సీనియర్ ఇంజనీర్ జాంగ్ యువాన్ హై చెప్పాడు. సింక్ హోల్ పై రీసెర్చ్ చేసిన టీంని లీడ్ చేసిన చెన్ లిక్సిన్ "సింక్ హోల్లో నేలపై ఒక వ్యక్తి భుజాలంత ఎత్తులో దట్టమైన పొదలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు సైన్స్ గుర్తించని కొత్త జీవ జాతులు ఉన్నాయని తెలిసిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు" అన్నాడు.
- విత్తనాలు
ఇలాంటి సింక్ హోల్స్ ని రెండు రకాలుగా జీవం పుడుతుంది. అక్కడి పరిస్థితులు జీవం పుట్టడానికి కారణం కావొచ్చు. లేదంటే.. ఏవైనా పక్షులు, ఇతర జీవులను అక్కడికి విత్తనాలను తీసుకెళ్లొచ్చు. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్లో ఉన్న ఒక పెద్ద గుహలో ఉష్ణ ప్రాంతాల్లో పెరిగే ఫెర్న్ జాతి మొక్కలు బాగా పెరిగాయి. ఆ చుట్టు పక్కల అలాంటి మొక్కల జాడే కనిపించలేదు. అక్కడ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే.. వాటి విత్తనాలను దక్షిణ, మధ్య అమెరికాకు వలస వచ్చే గబ్బిలాలు తీసుకొచ్చాయి. అవి ఈ గుహల్లో కొన్నాళ్ల పాటు ఉన్నాయి.
