తల్లిపాలే..యాంటీబాడీస్?

తల్లిపాలే..యాంటీబాడీస్?

ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న అతి పెద్ద సమస్య కోవిడ్ 19. దాని బారిన పడకుండా ఉండాలనే అందరూ కోరుకుంటున్నారు. అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయినా కూడా కరోనా వైరస్ బారిన పడితే? ‘‘ఒకవేళ అలా జరిగినా..భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు చెప్పే సజెషన్స్ ఫాలో కావాలి. మంచి ఫుడ్ తినాలి. ఫ్యామిలీ సపోర్ట్ తో ధైర్యంగా ఉండాలి. ఇలా చేస్తే కరోనా ఓడిపోవడం ఖాయం’’ అంటూ తన ఎక్స్ పీరియెన్స్ షేర్ చేసుకున్నారు ఒక డాక్టర్.

‘‘నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో పిల్లల డాక్టర్ (పిడియాట్రిషియన్)ని. నాకు ఐదు నెలల వయసున్న బాబు ఉన్నాడు. నా కోవిడ్–19 స్టోరీని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. జూన్ 28. నాకు ఆ రోజు చాలా నీరసంగా అనిపించింది. తరువాతి రోజు నుంచి విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు. మందులు వేసుకుంటున్నప్పటికీ రెండు రోజులైనా జ్వరం కంట్రోల్ కాలేదు. తర్వాత వాసన తెలియలేదు. దాంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ ‌చేయించుకున్నాను. మా బాబుకి కూడా జ్వరం, జలుబు మొదలయ్యాయి. కరోనా రిపోర్ట్ జూలై 1న చేతికి వచ్చింది. అనుమానించిందే… రిజల్ట్ పాజిటివ్. సింప్టమ్స్ మైల్డ్ గా ఉండడంతో హోంక్వారంటైన్ అయ్యాను. కానీ మనసులో మాత్రం భయం అనిపించింది. నెలల బిడ్డ, ఫ్యామిలీ…అన్నీ డిస్టర్బ్ అవుతాయేమోనని భయపడ్డా. కానీ, నా భయాన్ని పోగొట్టి నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు నా భర్త. అంతేనా నా కుటుంబమంతా… అత్తామామలు, స్నేహితులు నాకు సపోర్ట్ పిల్లర్స్ గా ఉన్నారు. వాళ్లంతా నా చిన్నారి బాబుకు నా పాలు పట్టమని ఎంకరేజ్ చేశారు.

స్వతహాగా నేను కూడా పిడియాట్రిషియన్ కావడంతో…ఇలాంటి టైంలో పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే మేలు నాకు తెలుసు. తల్లి పాల నుంచి బిడ్డకు యాంటీబాడీస్ వెళ్తాయి. అవి కరోనాతో పోరాడతాయనే విషయం నాకు తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ నా బిడ్డకు పాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ, ఎన్ 95 మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ వేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. హైదరాబాద్‌లోని అపోలో క్రెడిల్‌లో చీఫ్‌ లాక్షన్ టే కన్సల్టెం ట్‌గా ఉన్న డాక్ట‌ర్ వినోద గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. నాకు బిడ్డ పుట్టిన మొదటి నెలలో లాక్టింగ్ ప్రాబ్లమ్ వస్తే చాలా సాయం చేశారావిడ. కోవిడ్ తో పోరాడుతున్న నేను, బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఎప్పటికప్పుడు గైడ్ చేశారు. అంతేనా, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు ఎలా చేయాలో కూడా నేర్పించారు. కష్ట కాలంలో నాకు అండగా, తోడుగా… ఒక్క మాటలో చెప్పాలంటే మా కుటుంబంలో ఒక వ్యక్తిలా నా విషయంలో కేర్ తీసుకున్నారు.

నాకు ట్రీట్ మెంట్ మొదలుపెట్టిన మూడు రోజుల తరువాత జ్వరం తగ్గింది. కానీ, కొత్త సింప్టమ్స్ కనిపించాయి. తల తిప్పడం, విపరీతమైన నీరసం, జలుబు, దగ్గు మొదలయ్యాయి. పోరాడాల్సింది ఇంకా చాలానే ఉందనిపించింది. అలాగని నేనేం బలహీనపడలేదు. నా మనోబలం, నా కుటుంబం అందుకు నాకు చాలా సాయపడ్డాయి. ఆ తర్వాత త్వరగానే అనారోగ్య లక్షణాలు నెమ్మదించాయి. ఆరోగ్యం కాస్త బెటర్ గా అనిపించింది. డాక్టర్‌ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ, బ్రీతింగ్ ఎక్సర్
సైజ్ లు చేశాను. ప్రాణాయామం, ఆవిరి పట్టడం, గోరు వెచ్చని నీళ్లు పుక్కిలించడం, కాయగూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు తినడం, పాలు, హెర్బల్ టీ తాగడం వంటివన్నీ నా డైలీ రొటీన్‌గా చేసుకున్నాను. రోజులు గడుస్తున్నా కొద్దీ నా ఆరోగ్యం కుదుట పడింది. నా చిన్నారి బాబు నాకు తోడుగా ఉండడం వల్ల రోజులు త్వరగా గడిచిపోయాయి. వాడి బోసినవ్వులు, పాలుగారే ముఖం నాలో ఎప్పటికప్పుడు సంతోషాన్ని నింపాయి. జూలై 18 నాడు మళ్లీ నా టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. అది నెగెటివ్. ఆ
తరువాత నుంచి మళ్లీ రొటీన్ లైఫ్ మొదలు. పాలిచ్చే తల్లులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని పాలు ఇవ్వకుండా ఉండొద్దు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్ట‌ర్ పర్యవేక్షణలో పిల్లలకు పాలివ్వొచ్చు. తల్లి పాల ద్వారా పసివాళకు నేచురల్ వ్యాక్సిన్ అందించినట్టే. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ తో పోరాడే యాంటీ బాడీస్ ను మీ పాల ద్వారా బిడ్డలకు ఇస్తున్నట్టే. ఈ మొత్తం జర్నీలో నేను చెప్పేదేంటంటే… ఒంటరిగా పోరాడాలంటే కష్టంగా ఉంటుంది. అదే ఫ్యామిలీ తోడుగా ఉంటే ఎంత పెద్ద యుద్ధమైనా గెలవడం ఖాయం. నేను అలానే గెలిచాను. నా అనుభవాన్ని ఇలా పంచుకోవాలని ఎంకరేజ్ చేసిన డాక్ట‌ర్ వినోద గారికి థ్యాంక్యూ. అందరి తల్లులకు నా అనుభవం ఉపయోగపడుతుందనే నా ఆశ.’’