మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ (Antony Varghese) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాటాలన్’ (Kattalan). ఇందులో కబీర్ దుహాన్ సింగ్, సునీల్, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మార్కో’ వంటి భారీ యాక్షన్ చిత్రాలను నిర్మించిన క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాల్ జార్జ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే20న తెలుగులోనూ విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. అడవి నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ మొదటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తూ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. అడవుల్లో జరుగుతున్న ఏనుగు దంతాల అక్రమ రవాణా అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఏనుగుల వేట చుట్టూ అల్లుకున్న ఈ కథ అత్యంత ఉత్కంఠభరితమైన వైల్డ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అధికారం కోసం ఆరాటపడే శక్తులకు వ్యతిరేకంగా హీరో ఎలాంటి భయంకరమైన యుద్ధం చేశాడనేది మెయిన్ పాయింట్ అని ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది.
అలాగే రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. యూట్యూబ్‌లో ట్రైలర్ చూస్తున్న సమయంలోనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆడియో ట్రాక్ మార్చుకునే సదుపాయం కల్పించారు. దీంతో మూడు రకాల సౌండ్ వేరియేషన్లలో ట్రైలర్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి ఫీచర్ చాలా అరుదుగా కనిపించడంతో, ఇది ఒక వినూత్న ప్రయత్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
