సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. జూన్ 16న అక్కడి స్థానిక తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలనా దక్షత, నాయకత్వ శైలిపై రాసిన CBN@361 Degrees - Polymath అనే పుస్తకాన్ని చంద్రబాబు రిలీజ్ చేశారు.
పుస్తకావిష్కరణ అనంతరం.. సీఎం చంద్రబాబు ఈ గ్రంథం మొదటి కాపీలను సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్‌గా, విజనరీ లీడర్‌గా చంద్రబాబు గడిచిన కొన్నేళ్లలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను ఈ పుస్తకంలో సంపూర్ణంగా విశ్లేషించారు.
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించగా... విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ దీనిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లెట్ చేశారు. చంద్రబాబు దూరదృష్టి, కఠినమైన నిర్ణయాలు తీసుకునే తీరును.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ నాయకులు, సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ,న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ల నాయకత్వ శైలితో రచయిత ఈ పుస్తకంలో పోల్చారు.
జూన్ 16న ఇవాళ ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్‌పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వనున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్మాణాలు, భూ వినియోగం తదితర అంశాలపై సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సీఆర్డిఏ అధికారుల సమావేశం కానున్నారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రికి సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై ఇండియాకు రానున్నారు సీఎం చంద్రబాబు
