ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, యువ నేపథ్య గాయకుడు ఏఆర్ అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో సోమవారం (10 ఆగస్ట్ 2026) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అసలేం జరిగిందంటే?
పోలీసులు, మీడియా కథనాల ప్రకారం.. చెన్నైలోని గిండి ప్రాంతంలోని ఒలింపియా టెక్ పార్క్ సిగ్నల్ సమీపంలో సోమవారం ఆగస్ట్ 10న తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏఆర్ అమీన్ తన స్నేహితుడితో కలిసి పోర్షే కారులో జవహర్లాల్ నెహ్రూ రోడ్ మీదుగా గిండి వైపు వెళ్తుండగా.. పక్క రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చిన ఓ వ్యాగన్-ఆర్ క్యాబ్ వారి కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆసుపత్రికి తరలింపు.. డిశ్చార్జ్
ప్రమాదంలో ఏఆర్ అమీన్, ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు, క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కూడా గాయాలు కావడంతో కళైంజర్ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కూడా డిశ్చార్జ్ అయినట్లు సమాచారం.
Singer AR Ameen, son of AR Rahman, escaped with minor injuries after his luxury car collided with a taxi near Chennai's Kathipara Flyover while he was travelling from Koyambedu with a friend. The taxi driver also sustained minor injuries in the early morning accident.#arameen… pic.twitter.com/lsmog5eI0f
— The Federal (@TheFederal_News) August 10, 2026
ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు..
ప్రమాదంపై సమాచారం అందుకున్న అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్ అమీన్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
అమీన్ సాంగ్స్?
ఏఆర్ అమీన్ తన తండ్రి ఏఆర్ రెహమాన్ సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్లేబ్యాక్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలోని ‘చికిరి చికిరి’ పాట తమిళ వెర్షన్‌కు ఆయన గాత్రం అందించారు. అలాగే జస్లీన్ రాయల్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్లతో కలిసి ‘భీగీ భీగీ’ అనే ఇండిపెండెంట్ పాటలోనూ కనిపించారు.
