మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఫారెన్ ఏజెంట్లేనా? CJP విషయంలో బీజేపీ తీరుపై అన్నామలై ఫైర్

మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఫారెన్ ఏజెంట్లేనా? CJP విషయంలో బీజేపీ తీరుపై అన్నామలై ఫైర్

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం నేరమా? పాలకవర్గాల వైఫల్యాలను ఎత్తిచూపితే వారిని 'ఫారెన్ ఏజెంట్లు'గా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? సరిగ్గా ఇవే ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ కే. అన్నామలై కావటం అత్యంత ఆసక్తికరంగా మారింది. మోడీ ప్రభుత్వంపై అన్నామలై వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 'కాక్రోచ్ జనతా పార్టీ' నేతలపై జరిగిన ఢిల్లీ పోలీసుల అణచివేతను తీవ్రంగా తప్పుబడుతూ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఢిల్లీలో సీజేపీ నేతల నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరును, ముందస్తు నిర్బంధ విధానాలను అన్నామలై ప్రశ్నించారు. సీజేపీ నిరసన పద్ధతులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వారి కొన్ని విధానాలు తనకు కూడా సబబుగా అనిపించలేదని చెప్పారు. దేశంలో ప్రజా సమస్యలపై గళం విప్పే హక్కు, నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని బలంగా సమర్థించారు. మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాలను తప్పుబట్టిన ప్రతిసారీ వారిపై దేశద్రోహ ముద్ర వేయడం, విదేశీ ఏజెంట్లుగా ప్రచారం చేయటం ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జూన్ 5వ తేదీనే తాను బీజేపీకి రాజీనామా చేశానని.. ఈ విషయాన్ని కొందరు కావాలనే మరిచిపోయి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నామలై ఘాటుగా బదులిచ్చారు. తన రాజకీయ వైఖరిపై కొద్ది రోజులుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు ఆయన సోషల్ మీడియాలో ఈ విధంగా గట్టి కౌంటర్ ఇచ్చేశారు. సీజేపీ లేవనెత్తిన ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. వారి నిరసనలను అణచివేయడం సరికాదన్నారు అన్నామలై.

అన్నామలై వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆయన పార్టీని వీడిన తర్వాత మాట మార్చారంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ నారాయణ తిరుపతి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను సమర్థించిన అన్నామలై.. నేడు అదే అంశంపై సీజేపీ, కాంగ్రెస్ పార్టీల గొంతుక కలపడం డబుల్ స్టాండ్స్ కి నిదర్శనమని ఆరోపించారు. మే నెలలో శశిథరూర్‌తో జరిగిన డిబేట్‌లోనూ ఈ సవరణను సమర్థించిన ఆయన, ఇప్పుడు వైఖరి మార్చడం ఆశ్చర్యకరమన్నారు.