చాలామంది పేరెంట్స్ కి రాత్రి పడుకునే ముందు పిల్లలకు గ్లాసెడు వేడివేడి పాలు ఇవ్వడం అలవాటుగా ఉంటుంది. అలాగే, కొంతమంది పిల్లలు పడుకునే ముందు డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటుంటారు. ఇలా తినే పిల్లల్లో ఎక్కువగా దగ్గు, ముక్కుకారడం. గొంతునొప్పి, అలసట, మలబద్దకం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు పిల్లల్లో ఉంటే.. అది 'మిల్క్ బిస్కట్ సిండ్రోమ్' కావొచ్చు.
మోతాదుకి మించి చక్కెర, ప్రాసెస్ చేసిన కొవ్వు పదార్థాలు తినే పిల్లల్లో ఈ 'మిల్క్ బిస్కెట్' సిండ్రోమ్ వస్తుంటుంది. అలాగే, ఆన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్.. ముఖ్యంగా లేట్ నైట్ తినడం కూడా ఈ సిండ్రోమ్ కి దారితీస్తుంది. కేవలం పాలు, బిస్కట్లు తినడం వల్లనే కాదు.. సాఫ్ట్ డ్రింక్స్, సోడా, ప్యాక్డ్ జ్యూస్, పాలు, ఫ్లేవర్డ్ డ్రింక్స్, యోగర్ట్, ఐస్క్రీమ్, చాక్లేట్, చక్కెరతో చేసిన స్నాక్స్ లాంటివి కూడా ఈ సిండ్రోమ్ రావడానికి కారణమవుతాయి. అయితే, ఎక్కువగా మాత్రం.. మిల్క్, నిల్వ చేసిన చక్కెర రిలేటెడ్ ప్రొడక్ట్స్ తినడం వల్లనే ఈ వ్యాధి వస్తుంది. నిద్రపోవడానికి ముందు ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల.. పొట్టలో ఇబ్బంది కలుగుతుంది. ఇలా తిని పిల్లలు నిద్రపోయినప్పుడు...
ఈ ఫుడ్ వల్ల ఉత్పత్తయ్యే యాసిడ్స్, అన్నవాహిక నుంచి వెనకకు ప్రవహిస్తాయి. కొన్నిసార్లు అవి గొంతువరకు కూడా చేరుతుంటాయి. ఇలా యాసిడ్స్ రివర్స్ ఫ్లో అయినప్పుడు పెద్దవాళ్లలా పిల్లల్లో గుండెల్లో మంట లాంటి సమస్యలు రావు. కానీ, ఈ సిండ్రోమ్ కారణంగా ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి వస్తాయి. ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నపిల్లల్లో.. సిండ్రోమ్ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ని కలవాలి.
ట్రీట్మెంట్
దీన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా టెస్టులేం అక్కర్లేదు. అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ కొనసాగితే.. ఈ లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధిని నివారించడానికి.. మన దగ్గర ఉన్న ఏకైక మార్గం.. నిద్రపోవడానికి ముందు మిల్క్, షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తినకుండా జాగ్రత్త పడటమే ! ఇలా చేసినప్పుడు మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ కి దారితీసే యాసిడ్ రిఫ్లక్స్ ను కంట్రోల్ చేస్తుంది. పాలు అంటేనే.. పోషకాల గని అనే పేరు ఉన్నప్పటికీ.. పగటిపూట పాలు తాగడం వల్లనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
