అక్టోబర్ 15న ఏషియన్ గేమ్స్ విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రికెట్ టీమ్ వెళ్తుందా?

అక్టోబర్ 15న ఏషియన్ గేమ్స్ విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రికెట్ టీమ్ వెళ్తుందా?

జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) లో భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసి పతకాలు సాధించిన అథ్లెట్లతో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సమావేశం కానున్నారు. అక్టోబర్ 15వ తేదీన ఢిల్లీ వేదికగా ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్ లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు కూడా పాల్గొననున్నాయి.   

85 పతకాలతో కిరాక్ ప్రదర్శన: 

ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత కాంటింజెంట్ అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ మొత్తం 85 పతకాలను సాధించగా.. అందులో 21 స్వర్ణాలు (Gold), 27 రజతాలు (Silver), 37 కాంస్య పతకాలు (Bronze) ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్, హాకీ, కబడ్డీ, షూటింగ్, ఆర్చరీ లాంటి విభాగాల్లో ఇండియా క్రీడాకారులు బంగారు పతకాలను సాధించారు. 

భారత క్రికెట్ జట్ల డబుల్ గోల్డ్ ధమాకా: 

ఈ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండూ పసిడి పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాయి. ఫైనల్ పోరులో ఇండియన్ మెన్స్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి బంగారు పతకాన్ని ముద్దాడింది. మహిళల జట్టు కూడా అదే తరహా ఆధిపత్యాన్ని ప్రదర్శించి స్వర్ణాన్ని సాధించింది.

బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రధానితో భేటీ: 

ఆసియా గేమ్స్ ముగిసిన తర్వాత మహిళల క్రికెట్ జట్టుకు విరామం లభించగా.. పురుషుల జట్టు మాత్రం ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. కాగా ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిగే ఈ భేటీ టీ20 సిరీస్ లోని 4వ, 5వ మ్యాచ్‌ల మధ్యలో జరగనుండటం విశేషం. అక్టోబర్ 14న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా 4వ టీ20 జరగనుంది. ఇక అక్టోబర్ 17న బెంగళూరు వేదికగా 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. దీంతో అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో సమావేశంలో పాల్గొని, అనంతరం 5వ టీ20 కోసం బెంగళూరుకు వెళ్లనుంది. 

న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్: 

విండీస్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరనుంది. అక్టోబర్ 22వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

* 1వ టీ20: అక్టోబర్ 22 (క్రైస్ట్‌చర్చ్)

* 2వ టీ20: అక్టోబర్ 24

* 3వ టీ20, అక్టోబర్ 27 

4వ టీ20, అక్టోబర్ 30

5వ టీ20, నవంబర్ 1