చాలాసార్లు తోటివాళ్లు ఏది చేస్తే అది నేనూ చేయాలనే భావనలో ఉంటాం. కెరీర్ విషయంలోనూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. అయితే, డెసిషన్ తీసుకునేంతవరకే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. కానీ, ఆపై ఇతరులపై ఆధారపడకూడదు. స్వంతంగా ప్రయత్నించి సాధించాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. అప్పుడే కల నెరవేరినట్టు అనిపిస్తుంది. మనసులో ఎలాంటి రిగ్రెట్ ఉండదు.
పైగా సొంత గుర్తింపు కోసం చేసే పోరాటంలో కచ్చితంగా ఇతరుల సాయం అవసరమవుతుంది. అది ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ కావొచ్చు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్‌తో ఇంకా ముందుకు సాగాలి. ఈ విషయాలన్నీ ఎవరూ నేర్పించక్కర్లేదు.. ఇలాంటి వాళ్ల లైఫ్ స్టోరీ తెలుసుకుంటే చాలు. ఇంతకీ అచ్చం మలయాళ నటుడు ఆసిఫ్ అలీలా కనిపిస్తోన్న ఈ నటుడు ఎవరు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
మలయాళ సినిమా ప్రపంచంలో ఆసిఫ్ అలీ అనే పేరు వినగానే ఒక మంచి యాక్టర్, స్టార్ అని గుర్తుకొస్తాడు. కానీ ఆయన తమ్ముడు మాత్రం అన్న స్టార్‌డమ్‌ని వాడుకోకుండా స్వతహాగా పేరుతెచ్చుకున్న నటుడు అస్కర్ అలీ. కొన్ని సినిమాలతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. 2017లో డెబ్యూ చేసి తొమ్మిది సంవత్సరాల్లో ఆరు సినిమాలు మాత్రమే చేసినా “ఇంకా ఫ్రెషర్‌గానే ఉన్నాను” అని చెప్పుకునే అస్కర్ జర్నీ సాదాసీదా కాదు. తన కష్టం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్యామిలీ సపోర్ట్‌తో ఎదిగిన ఒక యాక్టర్ ఇన్స్పైరింగ్ జర్నీ.
కేరళలోని తోడుపుజా పుట్టిన అస్కర్‌కు చిన్నప్పుడు సినిమా అంటే అంతా ఒక మ్యాజికల్ వరల్డ్‌గా కనిపించేది. అతని అన్న ఆసిఫ్ అలీ పదో తరగతి చదువుతున్నప్పుడు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అప్పటివరకు సినిమా అనేది క్లోజ్డ్ సర్కిల్లోనే జరిగేదని అస్కర్ భావించేవాడు. అన్న సినిమా ప్రయాణం చూస్తుండగా ఆ గ్లామర్ అస్కర్ని కూడా ఆకర్షించింది. అన్న ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన అస్కర్, చెన్నైకి వెళ్లి రాజీవ్ మేనన్ నడిపే మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్‌లో చేరాడు. కానీ క్లాసులకు ఎక్కువగా హాజరుకాలేదు. బదులుగా స్నేహితుల ఫిల్మ్‌లకు అసిస్ట్ చేస్తూ, సెట్ ఎలా పని చేస్తుందో ఫిల్మ్‌మేకింగ్ ఎలా జరుగుతుందో ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాడు.
మూవీ జర్నీ
2017లో ‘హనీ బీ 2.5’తో డెబ్యూ. అందులో అతని పాత్రకు అస్కర్ సొంత జీవితం కొంత మేరకు సరిపోయింది. తర్వాత ‘చెంబరతిప్పూ’, ‘కముకి’ (2018), ‘జీం బూమ్ భా’ (2019) వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. రొమాంటిక్ ఇమేజ్ ఏర్పడింది. కానీ అస్కర్‌కు అది సరిపోలేదు. ‘‘తొమ్మిది సంవత్సరాలు గడిచినా ఆరు సినిమాలే చేశా. కానీ ఉత్సాహం ఇంకా అదే” అని చెప్పిన మాటలు ఆయన మనస్తత్వాన్ని చూపిస్తాయి. డబ్బింగ్‌లో బలహీనతలు ఉన్నాయని గుర్తించి వాటిని సరిచేసుకున్నాడు. స్క్రిప్ట్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ చూసి ప్రాజెక్టులు ఎంపిక చేసుకున్నాడు. ఎక్కువ సినిమాలు చేయాలని కాకుండా తనను గుర్తించే పాత్రలు ఎంపిక చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
అతి పెద్ద సవాలు
అస్కర్ జీవితంలో “ఆసిఫ్ అలీ తమ్ముడు” అనే లేబుల్ తీసేయలేనిది. ‘‘ఇది పర్సనల్ లైఫ్‌లో గ్రేట్ బ్లెసింగ్. సెక్యూరిటీ, సపోర్ట్ ఇస్తుంది” కానీ “ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలంటే నేను మంచి సినిమాలు, మంచి పెర్ఫార్మెన్స్‌తోనే నిరూపించుకోవాలి. నిజానికి మా ఇద్దరి మధ్య ఎప్పుడూ సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. అనుభవంతోనే నేర్చుకోవాలి అంటాడు అన్న కూడా” అని అస్కర్ చెప్పాడు.
ఇంకా ఫ్రెషర్‌గానే ఉన్నా
అస్కర్ అలీ ప్రయాణం ఎవరికైనా స్ఫూర్తి. “నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అనుభవం నుంచి నేర్చుకోవాలి” అని ఆయన మాటలు చెప్పేది ఒకటే.. సినిమా కేవలం అవకాశం కాదు.. కష్టపడి సాధించాల్సిన కల’’ అంటాడు అస్కర్.
పోలీస్ క్యారెక్టర్లో..
2025లో ‘జేఎస్‌కే - జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’లో సీపీఓ ఫిరోజ్ మహమ్మద్ పాత్రతో పోలీస్ యూనిఫాం ధరించాడు. కానీ అసలు టర్నింగ్ పాయింట్ - ఈ ఏడాది విడుదలైన ‘సంభవం అధ్యాయం ఒన్ను’. ఇది మిస్టరీ, ఫాంటసీ, హారర్ మిక్స్ థ్రిల్లర్. డైరెక్టర్ జితు సతీషన్ మంగలత్తు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ‘సంభవం’ నుంచి ఈ ఫీచర్ ఫిల్మ్ తీశారు. జితు అస్కర్‌కు పాత ఫ్రెండ్. షార్ట్ ఫిల్మ్ సక్సెస్ చూసి ప్రొడ్యూసర్లు ఫీచర్ చేయాలని నిర్ణయించగా, జితు బిగ్ స్టార్స్ దగ్గరకు వెళ్లకుండా అస్కర్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇందులో అస్కర్ లీడ్ రోల్ చేశాడు.
పాలక్కాడ్ ధోని ఫారెస్ట్‌లో 28 రోజులు షూటింగ్ జరిగింది. నెట్‌వర్క్ లేని, ప్రశాంతమైన వాతావరణంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్గా సాగింది. “స్క్రిప్ట్‌లో షాట్ డివిజన్ కూడా ఉంది. నేను డైరెక్టర్ చెప్పినట్టు చేశాను. ఆ విజువలైజేషన్ అద్భుతం” అని అస్కర్ చెప్పాడు. ఈ సినిమా అస్కర్‌కు కేవలం ఒక అవకాశం కాదు. తన కెరీర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్. రొమాంటిక్ ఇమేజ్ నుంచి యాక్షన్, మిస్టరీ వైపు మారడం ద్వారా తన రేంజ్ చూపించాడు. అన్న ఆసిఫ్ లాగా హార్డ్ వర్క్ చేస్తూ డైట్, జిమ్, రోల్ ప్రిపరేషన్‌లో ఎంతో కష్టపడుతున్నాడని అస్కర్ స్వయంగా చెప్పాడు.

