ఇదేం గాలి దుమారం బాబోయ్.. దెబ్బకి గాల్లోకి లేచాడు.. యూపీలో 89 మందిని పొట్టనపెట్టుకున్న తుఫాను !

ఇదేం గాలి దుమారం బాబోయ్.. దెబ్బకి గాల్లోకి లేచాడు.. యూపీలో 89 మందిని పొట్టనపెట్టుకున్న తుఫాను !

బరేలీ: ఉత్తర ప్రదేశ్లో గాలి దుమారం సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఏకంగా మనిషి గాల్లో 100 మీటర్ల ఎత్తు లేచి కింద పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన బరేలీలో జరిగిందని తెలిసింది. బరేలీలో గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా తుఫాను సంభవించింది.

50 ఏళ్ల వ్యక్తి ఒక రేకుల షెడ్డుతో సహా గాలిలోకి లేచి కిందపడ్డాడు. దాదాపు 50 అడుగుల ఎత్తుకు గాలి ఆ వ్యక్తిని విసిరేసింది. అతను సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక పొలంలో పడ్డాడు. అతని చేయి విరిగింది. ఆసుపత్రిలో చికిత్స అందించి.. డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం మెరుపులు, విపరీతమైన గాలులతో.. ఉరుములతో కూడిన భారీ తుఫాను విరుచుకుపడింది. యూపీలోని పలు జిల్లాల్లో ఈ తుఫాను కారణంగా ఇండ్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీవ్ర విధ్వంసం జరిగింది. కనీసం 89 మంది మరణించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 100 మందికి పైగానే చనిపోయి ఉండొచ్చని అంచనా. 

ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది, సంత్ రవిదాస్ నగర్‌లో 14 మంది, ఫతేపూర్‌లో 11 మంది, మరియు మీర్జాపూర్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫానుల కారణంగా చెట్లు కూలిపోవడం, ఇళ్లు దెబ్బతినడం, గోడలు కూలిపోవడంతో ఉన్నావ్, బదౌన్, బరేలీ మరియు ప్రతాప్‌గఢ్‌తో సహా పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గాలి దుమారంతో కూడిన దుమ్ముధూళి తుఫాను అతలాకుతలం చేసింది.