AUS vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ వెదర్‌ఆల్డ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు వేటు వేశారు. రెండో టెస్టు కోసం అతడి స్థానంలో మ్యాట్ రెన్షాను జట్టులోకి పిలిపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఎదురైన ఎల్బీడబ్ల్యూ (LBW), బౌల్డ్ సమస్యలను అధిగమించేందుకు వెదర్‌ఆల్డ్ తన బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకున్నప్పటికీ, స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో కేవలం 23, 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో 12 ఇన్నింగ్స్‌ల తర్వాత అతని టెస్ట్ సగటు 20.36కి పడిపోయింది. యాషెస్ సిరీస్‌లో ట్రావిస్ హెడ్‌తో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఏప్రిల్‌లో అతనికి జాతీయ కాంట్రాక్ట్ లభించినప్పటికీ, కేవలం ఒకే ఒక్క టెస్టు తర్వాత సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టక తప్పడం లేదు.
జేక్ వెదర్‌ఆల్డ్ ప్రదర్శనపై కోచ్ కామెంట్స్ వైరల్:
వెదర్‌ఆల్డ్ ఫామ్ గురించి ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వెదర్‌ఆల్డ్ తన క్రీజ్ అలైన్‌మెంట్, మూవ్‌మెంట్ ప్యాటర్న్స్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లను (స్మాల్ శాంపిల్ సైజ్) చూసి ఒక ఆటగాడి సాంకేతికత ఎంత వరకు నిలబడుతుందో అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకోవడం, మరొకసారి డ్రైవ్ చేయబోయి అవుట్ అవ్వడం జరిగిందని, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని తట్టుకుని నిలబడగలడా లేదా అని చెప్పడానికి ఈ చిన్న శాంపిల్ సరిపోదని మెక్‌డొనాల్డ్ వివరించారు.
రేసులో జోష్ ఇంగ్లిస్, రెన్షాకు దక్కేనా అవకాశం?:
డార్విన్ వెళ్లిన 13 మంది సభ్యుల జట్టులో ఉన్న 31 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా అనూహ్యంగా ఓపెనింగ్ చేసేందుకు ఆసీస్ బోర్డుకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో సాధారణంగా 5వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసే ఇంగ్లిస్‌ను సెలెక్టర్లు టాప్-ఆర్డర్ ఆప్షన్‌గా పరిశీలిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇంగ్లాండ్ లయన్స్ పై క్రికెట్ ఆస్ట్రేలియా XI తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇంగ్లిస్ భారీగా పరుగులు చేసి మెప్పించాడు.
అయితే, సంప్రదాయ ఓపెనర్ మ్యాట్ రెన్షాకు తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నార్త్ క్వీన్స్‌లాండ్‌లోని ఈ వేదికపై రెన్షాకు ఇప్పటికే రెండు ఫస్ట్-క్లాస్ సెంచరీలు చేసిన అద్భుతమైన అనుభవం కూడా ఉంది. కాగా మ్యాట్ రెన్షా తన చివరి టెస్టు మ్యాచ్‌ను మూడేళ్ల క్రితం ఢిల్లీలో భారత జట్టుపై మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో రెన్షాకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరీ.
