12 సెంటీమీటర్ల తోకతో పుట్టిన శిశువు

12 సెంటీమీటర్ల తోకతో పుట్టిన శిశువు

జంతువులు మూడు కాళ్లతో పుట్టడం, మూడు కళ్లతో జన్మించడం వంటి వార్తల్ని మనం విన్నాం చూశాం. కానీ తాజాగా ఓ శిశువు తోకతో జన్మించింది. అప్పుడే జన్మించిన ఈ నవజాత శిశువుకి  తోకతో పాటు తోక చివర బంతి కూడా ఉండటంతో డాక్టర్లు సైతం షాక్ తిన్నారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజా అనే సిటీలో అల్బర్ట్ సాబిన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు డెలివరీ చేసిన డాక్టర్లు పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయారు. 

మగ బిడ్డ తోకతో జన్మించడంతో అవాక్కయ్యారు. చిన్నారికి దాదాపు 12 సెంటీమెటీర్ల తోకతో పాటు.. తోక చివరిలో బంతి వంటి ఆకారం కూడా ఉందని గుర్తించారు. అయితే తోక కేవలం చిన్నారి చర్మానికి మాత్రమే అంటుకొని ఉండటంతో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. నాడీ వ్యవస్థతో తోకకు ఎలాంటి సంబంధం లేవడంతో డాక్టర్లు శాస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని వెంటనే తొలగించారు. అయితే గతంలో మహిళకు పరీక్షలు నిర్వహించినప్పుడు కడుపులో బిడ్డకు తోక ఉండటం వంటి ఎలాంటి ఆనవాళ్లు కూడా గుర్తించలేదన్నారు . 

అయితే 35 వారాలకే డెలివరీ అవ్వడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. అయితే బిడ్డ కడుపులో ఎదుగుతున్న సమయంలో వారికి తోకలు కూడా పుట్టే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కడుపులో బిడ్డ ఎదుగుతున్న సమయం అంటే నాలుగు నుంచి 8 వారాల సమయంలోనే తోకలు కూడా వారికి పెరిగే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయన్నారు. పిడియాట్రిక్ హిస్టరీలోని ఇప్పటివరకు 40 మంది పిల్లలు మాత్రమే ఈ విధంగా జన్మించారన్నారు.