రోడ్డు విస్తరణకు బాలయ్య సగం ఇల్లు: TDR సర్టిఫికేట్ తీసుకుని అప్పగింత

రోడ్డు విస్తరణకు బాలయ్య సగం ఇల్లు: TDR సర్టిఫికేట్ తీసుకుని అప్పగింత

హైదరాబాద్: సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‏లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని తన 862.77 చదరపు గజాల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు. భూమి ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోలేదు. కేవలం టీడీఆర్ సర్టిఫికెట్లను తీసుకునేందుకు ఒప్పుకున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు తన కుమారుడు బాలకృష్ణ కోసం 1982లో ఈ ఇంటిని నిర్మించారు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో కుటుంబ వేడుకలు ఈ ఇంట్లో జరిగాయి. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతోన్న రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఈ భవనంలోని సగానికి పైగా భాగం తొలగింపునకు గురవుతుండటంతో బాలకృష్ణ ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు మారాల్సి వస్తోంది. 

తన తండ్రి నిర్మించిన, తన కుటుంబానికి ఎన్నో చిరస్మరణీయ వేడుకలకు సాక్ష్యంగా నిలిచిన ఇంటిని రోడ్డు విస్తరణ పనుల కోసం బాలకృష్ణ ప్రభుత్వానికి అప్పగిస్తుండటం గమనార్హం. బాలకృష్ణతో పాటు కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం జంక్షన్ దగ్గర ఫ్రీ-లెఫ్ట్ కోసం శబ్దాలయ స్టూడియోస్ 608 చదరపు గజాలు, ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద భవ్య కన్‌స్ట్రక్షన్స్ 341.33 చదరపు గజాల స్థలాన్ని టీడీఆర్ పద్ధతిలోనే ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పకున్నారు. 

జూబ్లీహిల్స్ హైదరాబాద్ రిచెస్ట్ ఏరియాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం భూమి ధర సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పలుకుతోందని రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం పలువురు ప్రముఖులు తమ స్థలాలను అప్పగించడంతో ప్రభుత్వానికి సుమారు రూ. 1,000 కోట్ల మేర భూసేకరణ ఖర్చు ఆదా అయినట్లు తెలుస్తోంది. 

భూమి ఇచ్చినందుకు బాలయ్యకు ఏం లాభం..?

కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ  పనుల కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని తన సొంత స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు బాలకృష్ణ అప్పగించారు. భూమి సర్కార్ కు అప్పగించినందుకు ప్రభుత్వం నుంచి ఆయన నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోలేదు. టీడీఆర్ సర్టిఫికెట్లను తీసుకునేందుకు ఒప్పుకున్నారు. టీడీఆర్ అంటే ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు నగదు రూపంలో పరిహారం ఇచ్చే బదులు భూ యజమానికి ఇచ్చే ఒక ప్రత్యేకమైన భవన నిర్మాణ హక్కుల సర్టిఫికెట్. 

సాధారణంగా ఏదైనా స్థలంలో ఇల్లు లేదా కమర్షియల్ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే కట్టాలి. కానీ ఈ టీడీఆర్ సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వ నిబంధనల కంటే అదనంగా ఎక్కువ అంతస్తులు లేదా ఎక్కువ విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించుకునే వెసులుబాటు లభిస్తుంది. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ టీడీఆర్ సర్టిఫికెట్‌ను యజమాని తన సొంత నిర్మాణాలకే ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. దీనిని ఇతర రియల్ ఎస్టేట్ డెవలపర్లు లేదా బిల్డర్లకు మార్కెట్ ధర ప్రకారం అమ్ముకోవచ్చు. తన స్థలం అప్పగించినందుకు తీసుకున్న టీడీఆర్ సర్టిఫికేట్‎తో బాలకృష్ణ ఆయన మరో చోట భారీ భవనం నిర్మించుకోవచ్చు. లేదా ఆ సర్టిఫికేట్‎ను రియల్ ఎస్టేట్ డెవలపర్లు లేదా బిల్డర్లకు భారీ ధరకు అమ్ముకోవచ్చు.