Balakrishna vs Nagarjuna : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. 30 ఏళ్ల తర్వాత బాలయ్య వర్సెస్ నాగార్జున!

Balakrishna vs Nagarjuna : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. 30 ఏళ్ల తర్వాత బాలయ్య వర్సెస్ నాగార్జున!

టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు ఒకే రోజు విడుదలవుతాయంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే అక్కినేని నాగార్జున చిత్రాలు నేరుగా తలపడితే ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న బాలయ్య 'దాదా', నాగార్జున 'కింగ్ 100' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

'దాదా'తో బాలయ్య మాస్ ట్రీట్..

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న 'దాదా'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' విజయంతో మరోసారి ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మంచు మనోజ్ కీలక విలన్ పాత్రలో కనిపిస్తుండగా, బాలయ్యతో ఆయన చేసే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంచనా. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. పోర్ట్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్‌ఫుల్ డైలాగులు, కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలయ్య అభిమానులకు కావాల్సిన మాస్ ట్రీట్‌ను దర్శకుడు ఏ స్థాయిలో అందించబోతున్నారో ఆసక్తి నెలకొంది.

 

‘కింగ్ 100’తో నాగ్ పవర్‌ఫుల్ డ్రామా...

మరోవైపు నాగార్జున తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంగా 'కింగ్ 100'ను తెరకెక్కిస్తున్నారు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో టబు ప్రతినాయిక ఛాయలున్న కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐశ్వర్య రాజేష్, అశోక్ సెల్వన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రూ.50 వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించే ఓ సామాన్యుడి ప్రయాణం, ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ పరిణామాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

30 ఏళ్ల తర్వాత మరో రసవత్తర పోరు..

బాలకృష్ణ, నాగార్జున సినిమాలు గతంలోనూ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. 1987 సంక్రాంతి సందర్భంగా బాలయ్య 'భార్గవరాముడు', నాగార్జున 'మజ్ను' చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1996లోనూ 'వంశానికొక్కడు', 'వజ్రం' సినిమాలతో ఈ హీరోల చిత్రాల మధ్య పోటీ ఆసక్తిని రేకెత్తించింది.

ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి క్రిస్మస్ రేసులో ఈ ఇద్దరి సినిమాలు తలపడటంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు బాలయ్య మాస్ యాక్షన్, మరోవైపు నాగ్ స్టైలిష్ థ్రిల్లర్.. ఇద్దరి కథలు, పాత్రలు, ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం పూర్తిగా భిన్నం. మరి ఈ క్రిస్మస్‌కు బాక్సాఫీస్‌ను 'దాదా' గా బాలయ్య షేక్ చేస్తారా? లేక 'కింగ్'గా నాగార్జున ఆధిపత్యం చాటుతారా? డిసెంబర్ 24 పోరు టాలీవుడ్‌కు ఎలాంటి వసూళ్ల పండుగను అందిస్తుందో చూడాలి..