హైదరాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా విభిన్న భావజాలాలు కలిగిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఏటా నిర్వహించే దత్తన్న అలయ్ బలయ్ గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ ఏడాది ‘నషా ముక్త్ భారత్’ నినాదంతో నిర్వహిస్తున్నారు. 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి సమీక్ష జరిపారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం ఉట్టిపడేలా పల్లె వాతావరణం, జానపద కళారూపాలు, పిండివంటలతో ప్రాంగణాన్ని సిద్ధం చేసినట్టు బండారు విజయలక్ష్మి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులను, అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయ్ బలయ్ ఫౌండేషన్ సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావు, ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
