- బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్లోని పర్యాటక ప్రాంతం కాక్స్ బజార్లో సముద్ర తీరాన ఉన్న ఒక రిసార్ట్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. వెదురు, చెక్కలతో నిర్మించిన రిసార్ట్ కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు అంతటా వ్యాపించాయి. భవనం పూర్తిగా దగ్ధమైంది. దీంతో10 మంది పర్యాటకులు సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మెరైన్ డ్రైవ్లోని పటువార్ టెక్ బీచ్ సమీపంలో ఉన్న ‘టుప్ టుప్ రెస్టో అండ్ రిసార్ట్’లో ఉదయం 6:30 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో రిసార్ట్లో దాదాపు 30 మంది ఉన్నట్టు సమాచారం.
వేకుమజాము కావడంతో పర్యాటకులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే దట్టమైన పొగ, మంటలు నలువైపులా అలుముకున్నాయి. బయటపడే దారిలేక 10 మంది పర్యాటకులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అతికొద్ది మంది మాత్రమే రిసార్ట్లో నుంచి ప్రాణాలతో బయటపడగలిగారని చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన తొమ్మిది మందిని కాక్స్ బజార్ సదర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
కిచెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, సముద్ర తీర ప్రాంతంలోని ఈ రిసార్ట్లో తగిన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
