నేను మాటిస్తున్నా.. 2026 ఏప్రిల్‎లో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు: మహ్మద్ యూనస్

నేను మాటిస్తున్నా.. 2026 ఏప్రిల్‎లో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు: మహ్మద్ యూనస్

ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై ఆ దేశ తాత్కలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2026 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన శుక్రవారం (జూన్ 6) ప్రకటించారు. 2026 ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజుననైనా ఎన్నికలు జరుగుతాయని దేశ పౌరులకు నేను మాటిస్తు్న్నానని అన్నారు. బంగ్లా సార్వత్రిక ఎన్నికలపై ఈ మేరకు యూనస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. యూనస్ నాయకత్వం మూడు ప్రధాన రాజకీయ పార్టీల విశ్వాసాన్ని పొందిందని పేర్కొంది. యూనస్ పరిపాలనలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుత ఎన్నికలకు వారు మద్దతు తెలిపారని వెల్లడించారు. 

యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాట్లాడుతూ.. బంగ్లా జాతీయ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‎లో జరుగుతాయని యూనస్ అన్ని పార్టీలకు చెప్పారని.. జమాత్, ఎన్‌సీపీ రెండూ పార్టీలు ఈ కాలపరిమితికి మద్దతు ఇచ్చాయని ఆయన తెలిపారు. కాగా, గతేడాది రిజర్వేషన్ల ఉద్యమం వల్ల షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయ తెలిసిందే. ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి పారిపోవడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కలిక ప్రభుత్వం ఏర్పడింది.

 దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్‎లోని ప్రధాన రాజకీయ పార్టీలు, ఆర్మీ యూనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) డిసెంబర్ 2025 నాటికి జాతీయ ఎన్నికలు నిర్వహించాలని యూనస్ ప్రభ్వుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో బంగ్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు యూనస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.