అమెరికా ఆర్థిక వ్యవస్థను కలవరపెట్టే భారీ పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టాలు, ఆంక్షల నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెరికాలోని 2వ అతిపెద్ద బ్యాంకైన 'బ్యాంక్ ఆఫ్ అమెరికా'పై యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా జరిమానా విధించింది. ట్రెజరీ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద జరిమానా. చైనా మనీలాండరింగ్ నెట్వర్క్లు, సరిహద్దు అక్రమ ఆర్థిక లావాదేవీలను నిరోధించడంలో, రిపోర్ట్ చేయడంలో బ్యాంక్ విఫలమైనట్లు అధికారులు చెప్పారు.
ఈ జరిమానాలో భాగంగా ఫెడరల్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయిన ఆఫీస్ ఆఫ్ ది కంప్టోలర్ ఆఫ్ ది కరెన్సీకి బ్యాంక్ ఆఫ్ అమెరికా 750 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఇది రెగ్యులేటర్ విధించిన అతిపెద్ద జరిమానాగా రికార్డ్ అయింది. అలాగే ఇరాన్, రష్యా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి వివిధ ఆంక్షల కార్యక్రమాలను ఉల్లంఘించినందుకు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్తో 11.6 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ను కూడా బ్యాంక్ కుదుర్చుకుంది. బ్యాంక్ సీక్రెట్ యాక్ట్ నిబంధనలను తాము ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది.
ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇంతటి పెద్ద బ్యాంకులు ఇలాంటి నిబంధనలను పాటించడంలో విఫలమైతే, అది మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థకే పెను ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. చట్టం కంటే ఏ సంస్థ కూడా అతీతం కాదని ఈ చర్య స్పష్టం చేస్తోందనన్నారు. గతంలో క్రిప్టో దిగ్గజం 'బినాన్స్'పై సుమారు 4 బిలియన్ డాలర్లు, 'టీడీ బ్యాంక్'పై దాదాపు 3 బిలియన్ డాలర్ల జరిమానాలు విధించిన తర్వాత.. ట్రెజరీ డిపార్ట్మెంట్ తీసుకున్న అతిపెద్ద చర్య ఇదే.
ఈ ఆరోపణలపై బ్యాంక్ ఆఫ్ అమెరికా స్పందిస్తూ.. ఆర్థిక నేరాల నిరోధక నిబంధనలను తాము తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. రెగ్యులేటర్లతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించుకున్నామని స్పష్టం చేసింది. ఆర్థిక నేరాలను అణచివేయడానికి తాము ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి టెక్నాలజీని అభివృద్ధి చేశామని, వేలాది మంది ఉద్యోగులను నియమించుకున్నామని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. రెగ్యులేటర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొంది.
