తెలంగాణలో దసరా పండుగొస్తే చాలు.. పట్నాల్లో బతికేటోళ్లు పల్లెబాట పడతరు! ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులంటూ ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూరికి చేరుకుంటారు. ఏడాదంతా కలవని కుటుంబాలు ఒక్కచోట చేరతయ్.. చిన్ననాటి స్నేహాలు మళ్లీ చిగురిస్తయ్.. బంధుమిత్రుల పలకరింపులతో పల్లె పులకించిపోతది! ఒక్కరోజైనా ఊరంతా ఒక్కటై... పల్లె పట్నమైతది!
పండుగకు ముందే లక్షలాది మంది ఒకేసారి సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులన్నీ వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. నిత్యం జనసందోహంతో హడావుడిగా కనిపించే హైదరాబాద్ నగరం మాత్రం పండుగ సెలవుల వేళ కాస్త నిశ్శబ్దాన్ని ఆహ్వానిస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు సైతం వాహనాల సందడి తగ్గి బోసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి.
ఎన్ని సౌకర్యాలున్నా.. ఎంతటి హడావుడి జీవితమైనా.. పండుగ వేళ సొంతూరిలో కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలిచ్చే ఆనందమే వేరు. మట్టి వాసనలో మమకారం.. పల్లె వాతావరణంలో ఆత్మీయత.. బంధాల మధ్య అనుబంధం.. ఇవన్నీ కలిస్తేనే పండుగకు అసలైన కళ. అందుకే నగరాలు ఖాళీ అవుతున్నా.. పల్లెలు కళకళలాడుతున్నాయి. ఎందుకంటే పండుగంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు.. మనుషుల్ని దగ్గర చేసే మధురమైన అనుభూతి!ఎంతైనా పండుగంటే పల్లెనే.. పల్లెలో పండుగ సంబురమంటే తరతరాలకూ మిగిలిపోయే తీపి జ్ఞాపకం.. పదికాలాలపాటు చెప్పుకునే ముచ్చట!
పల్లెల్లో అలాయ్ బలాయ్
దసరా వేళ సొంతూరికి చేరిన బంధుమిత్రులంతా అలాయ్ బలాయ్తో ఒకరినొకరు పలకరించుకుంటారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ప్రేమాభిమానాలను పంచుకుంటారు. చిన్ననాటి అల్లర్లు, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ మధురానుభూతుల్లో మునిగిపోతారు. కాలం మారినా.. ఊరు మారినా.. బంధాలు మాత్రం చెక్కుచెదరవని మధుర క్షణాలకు ఈ అలాయ్ బలాయ్ వేదికగా నిలుస్తుంది.
పండుగంటే పిండి వంటలు.. కొత్త బట్టలే కాదు! మనుషుల్ని మనుషులకు దగ్గర చేసే ఆత్మీయతల వేడుక. ఏడాదంతా ఎక్కడున్నా.. దసరా రోజున సొంతూరే పిలుస్తది.. ఆ పిలుపుతో పల్లె కళకళలాడతది. ఆ ఒక్కరోజు పల్లె పట్నమైతది.. బంధాలన్నీ మళ్లీ ఒక్కటైతయ్! ఏడాది కాలం దూరమైనా.. ఒక్క పలకరింపుతో దగ్గరవుతారు.
