బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. రానున్న రోజుల్లో ఇది వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 26 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాగల రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంగళ, బుధవారాల్లో తీరప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాకినాడ–కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
అర్నబ్ గా పిలువబడుతున్న ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా కదులుతూ కాకినాడ–కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక
తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుంచి మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తుపాను కదలికలు, గాలుల వేగం, వర్షపాతంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
