రెంట్ విషయంలో గొడవ : లాయర్ను కాల్చి చంపిన అద్దెకు ఉన్నోళ్లు

రెంట్ విషయంలో గొడవ : లాయర్ను కాల్చి చంపిన అద్దెకు ఉన్నోళ్లు

Bengaluru Crime News: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని, బకాయిపడ్డ రెంట్ డబ్బులు చెల్లించాలని కోరినందుకు ఓ న్యాయవాదిని ఆయన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టందూరు అగ్రహార ప్రాంతంలో నిన్న (2026, అక్టోబర్ 18, ఆదివారం) రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురికాగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హత్య: 

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తిని 42 ఏళ్ల అడ్వకేట్ మంజునాథ్ (Manjunath) గా గుర్తించారు. అయితే, మంజునాథ్‌కు చెందిన ఇంట్లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిరాయికి ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో, వారిద్దరితో మంజునాథ్ మాట్లాడేందుకు వెళ్లాడు. 

* హాట్ ఆర్గ్యుమెంట్: కాల్పులు జరగడానికి దాదాపు ఒక గంట ముందు అద్దె బకాయిలతో పాటు తమ ఇల్లు ఖాళీ చేయాలని అడ్వకేట్ మంజునాథ్, ఆ బీహారీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. 

* పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు: తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితులు తమ దగ్గర ఉన్న నాటు తుపాకీతో మంజునాథ్ నుదుటిపై (Forehead) నేరుగా కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావమై మంజునాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిందితులిద్దరూ సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు: 

* ఇక అడ్వకేట్ మంజునాథ్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుకున్న వెంటనే వైట్‌ఫీల్డ్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నిపుణుల బృందం ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి, క్లూస్ టీమ్‌తో కలిసి బుల్లెట్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను సేకరించింది.

* మృతదేహం తరలింపు: అనంతరం అడ్వకేట్ మంజునాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పరారీలో ఉన్న బీహార్‌కు చెందిన ఆ ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.