బెంగళూరు: బెంగళూరులో ఇల్లు రెంట్‌కు తీసుకోవడం రోజు రోజుకీ కష్టంగా మారుతోంది. చాలా చోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ.లక్షల్లో అడుగుతున్నారు. నోబ్రోకర్ వంటి లిస్టింగ్ వెబ్సైట్లో కొత్తగా యాడ్ అయిన ఇండ్లు రూ.25 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కోరుతున్నాయి. ఈ వెబ్సైట్లు కూడా తక్కువ వడ్డీకే లోన్ అందుబాటులో ఉందని చెబుతున్నాయి. తాజాగా నోబ్రోకర్‌లో లిస్టింగ్ అయిన అపార్ట్మెంట్ ఒకటి టెనంట్ నుంచి రూ.25 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కోరింది. మరోక అపార్ట్మెంట్ రూ.20 లక్షలు అడుగుతోంది. ఈ రెండు అపార్ట్మెంట్లలో కూడా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్నాయి.
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఇవి ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు టైపింగ్‌లో తప్పుడు పడి ఉండొచ్చని అంటుంటే, మరికొంత మంది ‘కిడ్నీ డొనేషన్’ ఆప్షన్ కూడా ఇవ్వాల్సిందని కామెంట్ చేశారు. పైన పేర్కొన్న అపార్ట్మెంట్ రెంట్ నెలకు రూ.2,50,000 (బేరం అడడానికి వీలు లేదు) . ‘ సెంట్రల్ ఏసీ ఉన్న నాలుగు లేదా అంత కంటే ఎక్కువ బెడ్రూమ్ల అపార్ట్మెంట్ విత్ సర్వంట్ రూమ్, టెర్రస్ గార్డెన్ రూమ్ రెంట్ నెలకు రూ.2.50 లక్షలు. స్విమ్మింగ్ పూల్, స్టీమ్, సానా, కేస్క్వాష్ కోర్ట్, క్లబ్ హౌస్, జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి’ అని లిస్టింగ్‌లో అపార్ట్మెంట్ ఓనర్ పేర్కొన్నారు. బెంగళూరులోని థనిసంద్ర మెయిన్ రోడ్, మరాఠహళ్లీ–ఓఆర్ఆర్ ఏరియాల్లో రెంట్లు వేగంగా పెరుగుతున్నాయని, కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చి టైమ్‌లో ఈ ప్రాంతాల్లో 2 బీహెచ్‌కే రెంట్ 24 శాతం ఎగిసిందని అనరాక్ రిపోర్ట్ పేర్కొంది. వైట్‌ఫీల్డ్, సారజ్పూర్ ఏరియాల్లో రెంట్లు వరుసగా 21 శాతం, 20 శాతం గ్రోత్ నమోదు చేశాయని వెల్లడించింది.