తమలపాకుతో కిళ్లీను కాదు .. వెరైటీ వంటలు కూడా .. లడ్డు, పాయసం, రైస్ తయారీ ఇలా..!

తమలపాకుతో కిళ్లీను కాదు .. వెరైటీ వంటలు కూడా ..  లడ్డు, పాయసం,  రైస్  తయారీ ఇలా..!

తమలపాకు అనంగనే గుర్తొచ్చేది తాంబూలం. ఇంట్లో ఫంక్షన్ ఏదైనా తమలపాకులు ఉండాల్సిందే. పెళ్లిలో పుష్టిగా భోజనం తిన్నాక కమ్మని కిళ్లీ కట్టిస్తారు. అలా ఖారా కిళ్లీ, స్వీట్ కిళ్లీ, చాక్లెట్ పాన్ అని రకరకాలు తింటాం. భోజనం చేసిన తర్వాత ఆకు తింటే డైజేషన్ బాగుంటుందని చెప్తారు. దాంట్లో పోషకాలు కూడా చాలానే ఉంటాయి. అలాంటి తమలపాకుతో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్​ గా  అయితే బజ్జీలు చేసుకుంటాం. కానీ, తమలపాకుతో ఐస్ క్రీమ్, రసం, లడ్డూలు చేసుకోవచ్చని మీకు తెలుసా?. ఇన్ని వంటలు ఉన్నాయా? అని ఆశ్చర్య పోతున్నారా! అయితే, తమలపాకుతో ఏఏ స్పెషల్స్ వంటకాలు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

తమలపాకు లడ్డు తయారీకి కావాల్సినవి

  • తమలపాకులు- నాలుగు
  • పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
  • బెల్లం- 200గ్రాములు
  • నీళ్లు - 75 ఎమ్ఎల్
  • యాలకుల పొడి - ఒక టేబుల్ స్పూన్
  • గుల్​ కంద్- రెండు టేబుల్ స్పూన్లు 
  • ఎండు కొబ్బరి తురుము - అర కప్పు

తమలపాకు లడ్డు తయారీ విధానం 

ఒక పాన్​ లో బెల్లం తరుగు వేసి, నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి. తర్వాత మంట తగ్గించి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, గుల కంద్ వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత తమలపాకులకు కాడలు తీసి సన్నగా తరిగి దాన్ని పాకంలో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం గోరు వెచ్చగా అయ్యాక లడ్డూల్లా చుట్టాలి. లడ్డూలకు ఎండు కొబ్బరి పొడి అద్ది తినేయొచ్చు. వీటిని గాలి చొరబడని జార్​ లో పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటాయి.

తమలపాకు పాయసం తయారీకి కావాల్సినవి

  • తమలపాకులు - రెండు
  • బాస్మతి రైస్ - 50 గ్రాములు
  • చక్కెర- 50 గ్రాములు
  • పాలు 750 ఎంఎల్
  • కివ్ రా ఎసెన్స్- ఒక టీ స్పూన్

తమలపాకు పాయసం తయారీ విధానం

బాస్మతి రైస్ ను బాగా కడిగి అరగంట నానబెట్టాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో పాలు పోసి పొంగు వచ్చేవరకు కాగబెట్టాలి. తర్వాత బియ్యం వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత తమలపాకులను చిన్న ముక్కలుగా చేసి పాలల్లో వేయాలి. ఒక మాదిరి మంట మీద ఎనిమిది నిమిషాలు ఉడికించాలి. తర్వాత చక్కెర వేసి కరిగే వరకు కలపాలి. చల్లారాక కివ్​రా ఎసెన్స్ వేస్తే టేస్టీ పాన్ పాయసం రెడీ. పాయసాన్ని ఫ్రిజ్​ లో పెట్టుకుని చల్లగా తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.

తమలపాకు రైస్ తయారీకి  కావాల్సినవి

 

  • తమలపాకులు - నాలుగు
  • మిరియాలు - అర టేబుల్ స్పూన్
  • జీలకర్ర- ముప్పావు స్పూన్
  • ఉల్లిగడ్డ - ఒకటి
  • వెల్లుల్లి -కొద్దిగా
  • పసుపు- కొద్దిగా 
  • నిమ్మరసం- రెండు టేబుల్ స్పూన్లు.
  •  కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు- తగినంత
  • తాలింపు కోసం: నూనె, ఆవాలు
  • జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు

తమలపాకు రైస్​ తయారీ విధానం

మిక్సీ గిన్నెలో తమలపాకులు. మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఒక కళాయిలో నూనెవేడి చేసి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు వేసి వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా వేగించాలి. ఆ తర్వాత తమలపాకు పేస్టు తాలింపులో వేసి నూనె పైకి వచ్చేవరకు మగ్గించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, అన్నం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేస్తే సరిపోతుంది.