మలయాళంలో 'ప్రేమలు' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అదే కాంబినేషన్‌లో, యూత్ ఫేవరెట్ దర్శకుడు గిరీశ్ ఏడీ తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'. ఇప్పటికే ఈ మూవీ మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఐకానిక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ రోజు ( సెప్టెంబర్ 4, 2026 ) థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. బారీ అంచనాల మధ్య వచ్చిన ఈ క్రేజీ ఏజ్ గ్యాప్ లవ్ డ్రామా తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథేంటంటే?
అంగమాలిలో కేటరింగ్ బిజినెస్ నడుపుకునే సాదాసీదా బ్యాచిలర్ జస్టిన్ (నివిన్ పౌలీ). గతంలో ఆయనకు ఎదురైన ఓ బ్రేకప్ వల్ల పెళ్లిపై ఆశలు వదిలేసుకొని.. కుటుంబం కోసం బ్రతుకుతుంటాడు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న ఆయన జీవితంలోకి కాలేజీ విద్యార్థిని ఆష్లే (మమిత బైజు) ఎంట్రీ ఇస్తుంది. తండ్రి తాగుడు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సొంత ఊరు వదిలి జస్టిన్ ఇంటి పక్కనే అద్దెకు దిగుతుంది ఆష్లే కుటుంబం.
స్థానిక చర్చి ప్రార్థనా బృందం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' ద్వారా వీరికి పరిచయం ఏర్పడుతుంది. జస్టిన్‌తో దాదాపు 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, అతని నిష్కల్మషమైన వ్యక్తిత్వం, పరిణతి చూసి ఆష్లే ప్రేమలో పడుతుంది. మొదట్లో జస్టిన్ వెనకడుగు వేసినా.. ఆమె నిజాయితీ గల ప్రేమకు ఫిదా అయిపోతాడు. అయితే ఈ ఇద్దరి రహస్య ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలిసాక వారి అభిప్రాయం ఏంటి? ఎలాంటి కామెడీ రచ్చ జరిగింది? ఆ ఏజ్ గ్యాప్ వివాదంను దాటి ఈ జంట పెళ్లి పీటల వరకు ఎలా వెళ్లారు అనేదే అసలు కథ..
ఎలా ఉందంటే?
దర్శకుడు గిరీశ్ ఏడీ మార్క్ హెవీ-డోస్ సిట్యుయేషనల్ కామెడీ ఈ సినిమాకు ప్రాణం. 90ల నాటి ఆడియో క్యాసెట్లు, మ్యూజిక్ బ్యాండ్ల నేపథ్యంలో హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని చాలా క్యూట్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా జస్టిన్ తమ్ముడు జోయెల్ (సంగీత్ ప్రతాప్) షార్ట్ ఫిలిం మేకింగ్ పేరుతో చేసే హంగామా, గ్లిక్సన్ గా రోషన్ షానవాస్ కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ప్రపోజల్ సీన్ రియల్ హైలైట్ గా ఉందంటున్నారు సినీ ప్రియులు.
ఇక సెకండాఫ్ లో కథ కాస్త భావోద్వేగాల వైపు మళ్లినా... కామెడీ మోతాదు తగ్గకుండా చూసుకున్నారు. ఆర్కే వెంపా అందించిన తెలుగు సంభాషణలు డబ్బింగ్ అనుభూతిని ఇవ్వకుండా మన సీమాంధ్ర, తెలంగాణ నేటివిటీకి బాగా కుదిరాయి అని అంటున్నారు. విష్ణు విజయ్ సంగీతం, అజ్మల్ సాబు విజువల్స్ కేరళ అందాలను ఎంతో ఆహ్లాదకరంగా ఆవిష్కరించాయి.
ఎవరెలా చేశారంటే?
కంబ్యాక్ స్టార్ నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో జీవించేశారు. వయసు మళ్లిన ప్రేమికుడిలోని బిడియం, ఇన్ సెక్యూరిటీని అద్భుతంగా పండించారు. ఇక మమిత బైజు తన చూపులతోనే ఎమోషన్స్ పండించి, మరోసారి మైమరిపించింది. వీళ్లిద్దరి మధ్య స్కిన్-డీప్ కెమిస్ట్రీ సూపర్ అంటున్నారు ప్రేక్షకులు. కామెడీ టైమింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, శ్యామ్ మోహన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా కొద్దిగా సాగదీతగా అనిపించే ప్రీ-క్లైమాక్స్, కాస్త ఊహకందే కథనం మినహా... 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' ప్రతీ ఒక్కరూ హాయిగా నవ్వుకునే ఫుల్-లెంగ్త్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా టాక్ ను సొంతం చేసుకుంది. ఈ 'ప్రేమలు' కాంబో మలయాళంలో మళ్లీ హిట్ కొట్టింది. కాసుల వర్షం కురిపించింది.. మరి తెలుగులో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
