- దమ్మపేట మండలంలో గంజాయి, నాటు తుపాకీ స్వాధీనం
దమ్మపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో ఆరుగురి వ్యక్తుల నుంచి గంజాయి, నాటు తుపాకీ స్వాధీనం చేసుకొని వారిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
దమ్మపేట మండలం కోడిశలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగు ఇంట్లో అటవీ జంతువుల వేటకు నాటు తుపాకీ ఉందన్న పక్కా సమాచారంతో అటవీ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న పెనుబల్లి నాగు, పెనుబల్లి రవి, తాటి సాయికృష్ణ, పెనుబల్లి శ్రీను, తాటి నవీన్, సప్పిడి సమ్మయ్య వద్ద నుంచి సుమారు రూ. 3 లక్షల విలువైన 5.3 కిలోల గంజాయిని, అనుమతి లేని నాటు తుపాకీని, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్ర, -ఒడిషా సరిహద్దులోని డొంకరాయి వద్ద రామ అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి, దమ్మపేట మండలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీను ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్, అశ్వరావు పేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎఫ్ఆర్వో శ్రీను, దమ్మపేట ఎస్సై రాజేశ్, పోలీస్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
