ఖమ్మం, వెలుగు: సూపర్ ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని, ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం కలెక్టర్ దివాకర, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి సుమారు రూ.126 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కొదుమూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్..
రాష్ట్ర విభజన సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6,648 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 20,018 మెగావాట్లకు చేరిందని భట్టి తెలిపారు. సాధారణంగా ఏటా 6 నుంచి 6.5 శాతం పెరిగే డిమాండ్ ఈ ఏడాది అక్టోబరులో గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 470.22 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 178.60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.
44,034 చెరువుల్లో దాదాపు 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు ఉందని వివరించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గితే గ్రామీణ కూలీలు, రైతులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 9.1 లక్షల పనులను గుర్తించామని, మరో 8 లక్షల పనులను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
