- యువ దర్శకులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
- బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ చాలెంజ్ అవార్డ్స్ అందజేత
హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభం వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని డైరెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. యువ ఫిలిం మేకర్లు తమ సృజనాత్మకతతో సమాజాన్ని ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్స్, చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ చాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజయ్యారు.
షార్ట్ఫిల్మ్లు, పాటలు, జానపద గీతాలు, ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాసాలు ఇతర విభాగాల్లో జ్యూరీ కమిటీ ద్వారా సెలక్ట్ అయిన 29 మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం. వివిధ రంగులు, సువాసనలతో కూడిన పూలు ఒకచోట చేరినట్లుగా సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే వేడుక. అందుకే ఈ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇండియన్ సినిమాకు హైదరాబాద్ ను కేరాఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం తెలంగాణకు చెందిన పలువురు దర్శకులు, హీరోలు, నిర్మాతలు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. యంగ్ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. మూడు గంటల సినిమాలో చెప్పగలిగే కథను కేవలం రెండు, మూడు నిమిషాల షార్ట్ఫిల్మ్లో చెప్పడమూ గొప్ప సృజనాత్మకతే’ అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.
విద్యుత్ కీలక సమస్యగా మారే ప్రమాదం
సినిమా వినోదానికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే సాధనంగా మారాలని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, సూపర్ ఎల్నినో ప్రభావాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతంలో మార్పులు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి లభ్యత, విద్యుత్ కీలక సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరెంట్, నీటిని వృథా చేయకుండా ప్రకృతిని ఎలా పరిరక్షించాలి వంటి అంశాలను కథాంశాలుగా తీసుకొని షార్ట్ఫిల్మ్లు రూపొందించాలని యువ దర్శకులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉందని తెలిపారు.
యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దర్శకులు, కళాకారులు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, నటుడు నరేశ్, సాంస్కృతిక చైర్మన్ వెన్నెల గద్దర్, డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటు పలవురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
