నెలరోజుల సందే ఎదురుసూస్తుంటిమి. ఎట్లన్నజేశి పిల్లలకు కొత్త బట్టలు పట్టియ్యాలని అమ్మనాయ్నల తొక్కులాట. పక్కూరు చందుపట్లకెల్లి సైకిల్ మీద బట్టల మూటతో శాలొల్ల మామ వస్తుండే. మామ ఎట్లైతడంటే.. మా నాయ్నను బావ అని పిలుస్తుండే. కులాలు లేని ఓయ్ అనుకునే బంధం. మూట ఇప్పి అరుగు మీద పెట్టి.. ఒక్కొక్కటి ఇప్పి సూపిస్తుండే. అదే పే.. ద్ద షాపింగ్ మాల్.
నచ్చిన పైంట్.. బుషోట్ బట్ట సూపిత్తే కత్తెర తోటి పర్రున కత్తిరిచ్చి మర్తవెట్టి ఇచ్చేది. అంత ఉద్దేర బ్యారం. అదనకు ఐదో పదో ఉంటే ఇచ్చేది..లేకుంటే కాపీల రాస్కుంటుండే. పంట కోశినంక మాకు పైసలు చేతికొచ్చినంక వచ్చి తీస్కపోతుండే. ఇగ మేరోళ్ల కాడ కుట్టిస్తానికి అదో తిప్పల. మస్తు మంది పీసులు పట్కోని అచ్చేటోళ్లు.
నాదే మొదాలు కుట్టాలంట నాదే మొదాలు కుట్టాలని లొల్లి. రేపు రాపో..ఎల్లుండి రాపో అని తిప్పిస్తుండే. ఒగొగపారి అంగి కుట్టినా గుండీలు పెట్టకపోవు. పాయింట్‌కు జిప్ ఉండకపోవు. ఐనా మీదికెల్లి మొల్దారం సుట్టుకోని కొత్త బట్టలు మందికి సూపిచ్చుకుంట బజాట్ల తిరిగిన ఆ రోజులే ఏరు.
పండుగకు తప్పకుంట ప్యారగాన్ జోళ్లు కొనియ్యాల్సిందే..లేకుంటే ఊకూనే ముచ్చటే లేదు. ఇగ కమ్మరొళ్ల తాత కొలిమి కాడికి వొయ్యి రోల్ రోకలు, సుత్తి జేపిచ్చి అగ్గిపెట్టెలనో, అబ్రేక్ కాయితంలనో పొటాష్ పోసుకుకొని దగ్గెర పెట్టుకునేది. రోల్ రోకల్ల, సుత్తిల పొటాష్ పోశి.. బండ మీద కొడితే డీమ్ అని పెద్ద సప్పుడొస్తుండే.
అవ్వే దసరా బాంబులు. తోక పటాకిల పాకిట్ ఒక్కటి కోనిస్తే...మస్తు సంబురం. పది రోజుల ముందే పది షేర్ల బియ్యం పట్టిస్తే.. బాయికాడ పెద్ద పెద్ద మొద్దులు పలగ్గొట్టేది. కట్టెల పొయ్యి మీద పే..ద్ద కడాయి పెట్టి చెవిల్లలు, అప్పాలు, మిర్చీలు, బొబ్బుడాలు చేస్తుంటే ఆడకట్టంత సుయ్యి సుయ్యి సప్పుళ్లే. నలుగురైదుగురు కల్శి ఓ యాటను కొని... మబ్బుల కోశి పోగులు ఏస్కుంటే ఇంత మెత్తటి కూర, ఇంత బొక్క, తలాయింత బోటి, తల్కాయ కూర వస్తుండే. ఎచ్చం మసాలా రోట్లే నూరి.. కూర వండుతుంటే కమ్మటి వాసన. ఇంటింటికి కోళ్లేనాయే..కోడి కూర, బగార బువ్వ వండుతుండేది.
దసరా పండుగంటే పూరీలు తప్పకుంట చేస్కునేది. అమ్మటాళ్లకు అందరు బంతి కూకున్నంక ఇంత పెద్దలకు పెట్టి..ముచ్చట్లు పెట్టుకుంట తింటుంటే అదో తుర్తి. అప్పట్ల తాగుడు అంటే కల్లే. ఎవలో ఒగలు కోటరు కీసలు, బీర్లు తెచ్చుకునేది. ఆడోళ్లకు థంప్సప్, కొక్కకోలాలు. ఇగ పోరలం దబ్బదబ్బ బర్లను మేపి.. కట్టేశి..ఇంత గడ్డెశి..జెప్పున ఇంటికి ఉరుకొచ్చి...కొత్త బట్టలు, ప్యారగన్ చెప్పులేస్కోని.. పొద్దంజాలం ఊరంత గూడి జమ్మికి బైలెల్లేది.
పాలపిట్ట.. జమ్మి ..దీవెనార్తులు
పాలపిట్టను సూడాలని మొగులంత దేవులాడేది. అగువడితే అదో సంబురం. ఎన్కో ముందో కనవడుతుండే. ఇగ కుల పెద్దలకు బొట్టు, కంకణం అందినంక... యాటను కొట్టేది. జమ్మి చెట్టు సుట్టు తిరిగి పూజలు జేశినంక.. కొమ్మలకు ఎగవడి.. ముండ్లు కోస్తున్నా అట్లన దువిషి జేబులేస్కునేది. కులాలతో సంబంధం లేకుంట.. వరసలు పెట్టి పిల్సుకుంట చిన్నలకు, పెద్దలకు అందరికి జమ్మివెట్టి అలైబలై తీస్కునేది. పెద్ద మన్సులకైతే కాళ్లకు దండం బెడితే..వొద్దు బిడ్డ అనుకుంటనే సల్లగా బతుకు అని దీవెనార్తి పెట్టోళ్లు. ఇగ ఇంటికొచ్చినంక అమ్మనాయ్నలకు.. అటెన్క అక్కచెల్లెండ్లకు జమ్మి వెట్టి.. కాళ్లు మొక్కి దివేనార్తి తీస్కునేది. పెద్దల ఫోట్వల ముంగట గూడ రొండాకలు పెట్టి తల్సుకునేది తాత, ముత్తాతలను. ఇగ ఇల్లిళ్లు తిరుక్కుంట పెద్దలకు, జమ్మి పెట్టెది. అద్దమ్మ రాత్రిదాకా ఊరంత అదో సంబురం. ఆడోళ్లంత ఒక్కకాడికి చెరి...మల్లోమల్క బతుకమ్మ ఆడుకునేది.
తెల్లారి పండుగ
ఇగ మర్నాడు పొద్దుగల్నే బాయికాడ పని జెల్దిన ఒడిపిచ్చుకొని ఇంటికొస్తుంటిమి. ఎందుకంటే దసరా తెల్లారి భోనగిరికి శిన్మకు పోవాలే తప్పకుంట. దోస్తులమంత గూడి...సైకిళ్లేస్కోని దబ్బ దబ్బ పొయ్యేవొరకు మాకంటే ముందే బొచ్చెడు మంది లైన్ కట్టేది. 5 రూపాలు, 10 రూపాలు, 20 రూపాల టికెట్లు. కింద మీదవడి టికెట్లు దొర్కవట్టేది. ఒక్కటి రొండు తక్వ వడితే..బ్లాక్ కొనేది. శిన్మ సూస్కుంట శీటిలు కొట్టుకుంట పొట్టుపొట్టు ఎంజాయ్ జేస్తుంటిమి. ఇగ ఇంట్రవెల్‌కు గోలి సోడా, బుడ్డ సమోసాలు, లేకంటే పల్లీ కాయ కొనేది. ఒగల్ల టికెట్లు దొర్కలేదన్కో.. సీదా భోనగిరి గుట్ట ఎక్కేటోళ్లం. మల్ల రొండో ఆటొరకు కిందికొచ్చి శిన్మ టికెట్లకు లైన్ల నిలవడేటోళ్లం. ఇంటికి ఆల్చంగవొయ్యినా
ఇంటోళ్లు ఏమనకవోదరు యాడాదిపోకారి పోతేవొయ్యిర్రి తియ్ అన్కునేటోళ్లు.
దసరా పండుగొస్తే మేకను కోశేది
గౌండ్లోల్ల మల్లన్న కల్లు తెచ్చిచ్చేది
పొద్దుగాల లేశి పాలపిట్టను సూశి
సాయంత్రం జమ్మికాడికివొయ్యి
అందరం గల్శి అలై బలై తీశి
పచ్చినెత్తురు వీర తిలకం దిద్దేది..
ఎట్లున్నవే నా పల్లె..ఎట్లున్నవే నా తల్లీ..
- నేర్నాల కిషోర్, రచయిత, గాయకుడు
తొవ్వ తప్పింది!
ఇప్పుడు దసరా తొవ్వ తప్పింది. గల్లీకో అమ్మవారి మండపం. చెప్పుల్లేస్కుంటలేరు. మెడల కాషాయం కండువాలు. కౌసు తినరు. భక్తి భక్తే ఉండాలేగని..అంత కొత్త కొత్తగా అనిపియ్యవట్టే. కొత్త బట్టలు కొనుడేమోగని చెడ్డిల మీదే తిరుగుడు. దోస్తులు కల్శి పోతుండ్రు జమ్మికి కాదు..సిట్టింగులకు. బీరు బాటిల్ మీదున్న పిట్టెనే పాలపిట్ట అనుకొని దర్శనం జేస్కుంటాండ్రు. జమ్మికి పోవుడు లేదు.. పాలపిట్టెను సూసుడు లేదు. ఇళ్లిళ్లు తిరుగుడు గాదు ఎదురువడ్డొళ్లకు అలై బలై ఇచ్చుడే మా భాగ్యం. బావుల పొంట సిట్టింగులు సుక్క ముక్క జంపుడే. మర్నాడు సైన్మలకు పోవుడులేదు..పిల్ల దసరా మల్లా సిట్టింగులే. దసరాంటే పిక్క తినుడు...లోప్క తాగుడైంది.
బతుకమ్మ పాటలకు డీజే మోతలు, దాండియా ఆటలు జోర్రినట్టే... దసరాకు గూడ తొవ్వ తప్పినట్టే కొడుతాంది. కాలం మారినట్టు మారాల్సిందే. కని పండుగ గొప్పతనం పోగొట్టుకుంటే ఎట్లా..? రేపటి రోజుల్ల ఇంకెంత మారుతదో. అందుకే యాదికున్నది కొంత తల్సుకుందాం. అందరికి దసరా జమ్మి బంగారంతోటి అలై బలై.
- రఘు భువనగిరి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు 'వెలుగు' కుమాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
