'కాలా హీరన్' నిర్మాతకు బెదిరింపులు.. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన మాజీ ప్రియురాలు!

'కాలా హీరన్' నిర్మాతకు బెదిరింపులు.. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన మాజీ ప్రియురాలు!

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన 'కృష్ణజింకల వేట' (Blackbuck Poaching Case) నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా 'కాలా హీరన్: ది బాటిల్ ఫర్ లెగసీ'. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే వివాదాలు మొదలవ్వగా, ఇప్పుడు ఆ మంట మరింత ఎక్కువైంది. సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ప్రమోషన్స్ ఆపేయాలంటూ నిర్మాత అమిత్ జానికి లీగల్ నోటీసులు పంపింది. అంతేకాదు, రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

నిర్మాతకు బెదిరింపులు..

కానీ, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చాడు నిర్మాత అమిత్ జాని. సల్మాన్ లీగల్ టీమ్ పంపిన నోటీసులను కెమెరా ముందే ముక్కలు ముక్కలుగా చింపేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వదిలాడు. తానేం తప్పు చేయలేదని, ఎవరి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని, సినిమాను ఆపేది లేదని తెగేసి చెప్పాడు. అయితే, ఈ వీడియో వైరల్ అయిన 36 గంటల్లోనే తనకు ఏకంగా 1000కి పైగా ప్రాణాపాయ బెదిరింపు సందేశాలు వచ్చాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అమిత్ జాని వాపోతున్నాడు.

సల్మాన్ మాజీ ప్రియురాలి ఎంట్రీ..

ఈ హైడ్రామా నడుస్తుండగా, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, నటి సోమీ అలీ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతకు సపోర్ట్ చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అమిత్ జాని వీడియో కింద ఆమె కామెంట్ చేస్తూ.. ఏ సబ్జెక్ట్ మీదైనా సినిమా తీసుకునే హక్కు మీకు పూర్తిగా ఉంది. కేవలం తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దాక్కుంటారు. బెదిరింపులకు పాల్పడతారు అంటూ సల్మాన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

బయోపిక్ కాదు బాబోయ్..

మరోవైపు చిత్రయూనిట్ ఇది సల్మాన్ ఖాన్ బయోపిక్ కాదని, కేవలం నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని చెబుతోంది. కానీ, సల్మాన్ పర్సనాలిటీ రైట్స్‌కు, ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఈ సినిమా ఉందనేది భాయ్‌జాన్ లీగల్ టీమ్ వాదన. ప్రస్తుతం సోషల్ మీడియా ఈ వివాదంతో రెండుగా చీలిపోయింది.

ఒకరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ మేకర్స్‌కు సపోర్ట్ చేస్తుంటే, మరొకరు పర్సనల్ లైఫ్‌ను ఇలా వాడుకోవడం తప్పు అని మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి, నయనతార కాంబినేషన్‌లో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ 'కాలా హీరన్' వివాదం మాత్రం ఆయన పాత గాయాలను మళ్ళీ రేపుతోంది.