బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' సందడి మొదలయ్యేలోపే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' హాట్ టాపిక్‌గా మారింది. సామాన్యులకు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చేందుకు ఈ ప్రీ-షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 'అగ్నిపరీక్ష సీజన్-2' అధికారిక ప్రీ-షోగా కొనసాగుతోంది. దీంతో సామాన్యులకు ఇచ్చే టాస్క్ లు ఈ షోకు మరింత హైప్ క్రేయేట్ చేస్తోంది.
ఇటీవల ఈ బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష సీజన్-2' షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటుడు నవదీప్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు తీవ్ర ఆరోపణలు చేయడం నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది. తనను నవదీప్ అవమానించాడని, తనకు జరిగిన పరిణామాలకు అతడే కారణమంటూ బాలు వరుస వీడియోలు పెడుతున్నాడు. కొన్ని వీడియోల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందన్నట్టుగా కూడా మాట్లాడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. బాలుకు మద్దతుగా పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ, నవదీప్ వ్యవహారశైలిని ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు పలువురు 'అగ్నిపరీక్ష సీజన్-2' సెలెక్ట్ కానీ వారు సైతం జడ్జీస్ పై మండిపడుతూ.. పోస్టులు చేస్తున్నారు. అయితే ఇన్ని విమర్శల మధ్య నవదీప్ ఎట్టకేలకు స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తనపై వస్తున్న కామెంట్లకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. 'అగ్నిపరీక్ష' అంటేనే కంటెస్టెంట్ల సహనం, మానసిక స్థైర్యాన్ని పరీక్షించే వేదిక అని వివరించాడు.
'బిగ్ బాస్' అనేది సమాజాన్ని ప్రభావితం చేసే షో. వంద మంది, రకరకాల మనస్తత్వాలతో కలిసి జీవించాల్సి వచ్చినప్పుడు మాటలను ఎలా తీసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అన్నదే అసలు పరీక్ష. అందుకే మమ్మల్ని జడ్జిలుగా పెట్టారు అని నవదీప్ చెప్పాడు.
అంతేకాదు.. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను ఎలా ఎదుర్కొంటారు, రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారు అనే అంశాలనూ పరీక్షిస్తామని స్పష్టం చేశాడు. హారర్ సినిమాకు వచ్చి భయపెట్టొద్దంటే ఎలా? 'అగ్నిపరీక్ష' డిజైన్ చేసిందే ట్రిగర్ చేయడానికి. నేను లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటేనే రండి.. లేదంటే రావొద్దు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో బాలు-నవదీప్ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఈ కౌంటర్‌పై ఉప్పల్ బాలు ఎలా స్పందిస్తాడన్నదే ఆసక్తికరంగా మారింది.
