Bigg Boss Telugu 10 : 'బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష'కు డేట్ ఫిక్స్.. హౌస్‌లోకి వెళ్లే అదృష్టవంతులు ఎవరంటే?

Bigg Boss Telugu 10 : 'బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష'కు డేట్ ఫిక్స్.. హౌస్‌లోకి వెళ్లే అదృష్టవంతులు ఎవరంటే?

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్' . అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 (Bigg Boss Telugu 10) కు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈసారి 'దశావతారం' అనే మైండ్ బ్లోయింగ్ ట్యాగ్‌లైన్‌తో, రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సీజన్ లాంఛనంగా ప్రారంభం కానుండగా... దానికి ముందే అసలైన  బిగ్గెస్ట్ డ్రామా మొదలుకాబోతోంది.

'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష' రెడీ..

అదే... ప్రతిష్టాత్మక 'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష'. హౌస్‌లోకి అడుగుపెట్టే సామాన్యులు ముందుగా పోటీదారులగా వారి అసలు సత్తాను పరీక్షించే 'బిగ్‌బాస్ అగ్ని పరీక్ష'. లేటెస్ట్ గా ఈ ప్రీమియర్ తేదీని సీజన్-9 విజేత కళ్యాణ్ పడాల ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం జియోహాట్‌స్టార్‌తో పాటు స్టార్ మాలో ప్రసారం కానుందని వెల్లడించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

కలలను ఎప్పుడూ వదలొద్దు...

ఈసారి 'అగ్ని పరీక్ష' కేవలం ఓ సెలెక్షన్ రౌండ్ మాత్రమే కాదు.. కలలు, కష్టం, ధైర్యం, పట్టుదల, గెలుపు కోసం జరిగే అసలైన యుద్ధంగా రూపొందుతోంది. జియోహాట్‌స్టార్ విడుదల చేసిన లాంచ్ వీడియోలో సాధారణ యువకుడిగా ప్రయాణం మొదలుపెట్టి, బిగ్‌బాస్ విజేతగా ఎదిగిన కళ్యాణ్ పడాల కథను హృద్యంగా చూపించారు. ఆ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. 'కలలను ఎప్పుడూ వదలొద్దు' అనే సందేశంతో వేలాది మందికి స్ఫూర్తినిస్తోంది.

 

ఈసారి మరింత కఠినంగా..

అయితే అసలు ఆసక్తి అంతా ఇప్పుడు 'అగ్ని పరీక్ష' పైనే ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అర్హత సాధించాలంటే, కామన్ పీపుల్ ముందుగా ఈ నిప్పుల గుండం దాటాల్సిందే. ఈ అల్టిమేట్ ఆడిషన్ వేదికపై పోటీదారుల మానసిక ధైర్యం, సహనం, ఒత్తిడిని తట్టుకునే శక్తి, వ్యక్తిత్వం, పోరాటస్ఫూర్తిని,  ఆత్మవిశ్వాసాన్ని నిలువునా పరీక్షించనున్నారు. టాస్కులు ఈసారి మరింత కఠినంగా ఉండబోతున్నాయని సమాచారం. ప్రతి ఛాలెంజ్‌ను దాటిన వారికే బిగ్‌బాస్ సీజన్-10 హౌస్‌లో అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కనుంది. 

'దశావతారం' ట్యాగ్‌లైన్‌తో ...

గత సీజన్‌లాగే బిందు మాధవి, అభిజిత్, నవదీప్ జడ్జీలుగా వ్యవహరించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అలాగే'అగ్ని పరీక్ష'లో విజయం సాధించిన కామన్ కంటెస్టెంట్లకు నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లో చోటు దక్కనుంది. సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు-10కు మరోసారి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.. 'దశావతారం' ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ కొత్త సీజన్‌లో ఎలాంటి ట్విస్టులు, షాకులు, ఎమోషన్స్ దాగి ఉన్నాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి తీవ్రమైన ఒత్తిడి, కఠినమైన టాస్కులు, ఊహించని సర్‌ప్రైజ్‌లు... ఇవన్నీ తట్టుకుని నిలబడే ఆ ఆశావహులు ఎవరు? ఈ అగ్ని పరీక్షను జయించి ‘బిగ్‌బాస్ 10’ మెయిన్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది... ఆగస్ట్ 15న ఈ రియల్ డ్రామాకు తెరలేవనుంది. ఈ అగ్ని పరీక్షను జయించి బిగ్‌బాస్ హౌస్ తలుపులు తెరిచేది ఎవరో చూడాలి..