Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు 10కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. హద్దులు దాటే కంటెస్టెంట్లకు నాగ్ ముందే హెచ్చరిక!

Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు 10కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. హద్దులు దాటే కంటెస్టెంట్లకు నాగ్ ముందే హెచ్చరిక!

బుల్లితెరపై అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో ' బిగ్‌బాస్ ' తెలుగు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్-10తో మరింత గ్రాండ్‌గా రాబోతోంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, లేటెస్ట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.

హద్దులు దాటితే..

బిగ్ బాస్ పదో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు నాగార్జున ఈసారి షో గత సీజన్లన్నింటికంటే భిన్నంగా, మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. గత సీజన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా, వ్యూహాత్మకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, హౌస్‌లో కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎలాంటి రాజీ ఉండదని నాగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రోమోల షూటింగ్ కూడా పూర్తయ్యిందని నాగార్జున వెల్లడించారు.

'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' ఎప్పుడుంటే?

ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఆగస్టు 15 నుంచి  స్టార్ మా, జియో హాట్‌స్టార్ వేదికగా  ప్రసారం కానుంది. ఈ స్పెషల్ షోలో సామాన్యులు తమ ప్రతిభను నిరూపించుకుని నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం పొందనున్నారు. దాదాపు 15 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో కఠినమైన టాస్కులు, మానసిక పరీక్షలు, టీమ్ ఛాలెంజ్‌ల ఆధారంగా ఫైనల్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు..

అటు సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ జరగనున్నట్లు సమాచారం.  రెగ్యులర్ ఎపిసోడ్‌లు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సీజన్ కూడా సుమారు 15 వారాల పాటు సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు  హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. సినీ నటులు, టీవీ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సింగర్లు, అలాగే అగ్నిపరీక్ష ద్వారా ఎంపికయ్యే సామాన్యులు ఈసారి హౌస్‌లో సందడి చేయనున్నారు.

అయితే అధికారికంగా ఒక్క పేరును కూడా నిర్వాహకులు వెల్లడించలేదు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్‌లు, ఊహించని ట్విస్టులు, భారీ టాస్కులు, నాగార్జున స్టైలిష్ హోస్టింగ్‌తో బిగ్‌బాస్ తెలుగు 10 ఈ ఏడాది బుల్లితెరపై అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా నిలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.