Bigg Boss Telugu Season 10: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలంటే ఇంత టార్చర్‌ అవసరమా? 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు!

Bigg Boss Telugu Season 10: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలంటే ఇంత టార్చర్‌ అవసరమా? 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు!

తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10పై అప్పుడే భారీ హైప్‌ మొదలైంది. షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు ఎవరు? సామాన్యుల నుంచి ఎవరికి ఛాన్స్‌ దక్కుతుంది? అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో సామాన్యులను బిగ్‌బాస్‌ హౌస్‌కు ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష సీజన్‌ 2' రసవత్తరంగా సాగుతోంది. మరో వైపు 'అగ్నిపరీక్ష'లో ఇస్తున్న టాస్క్ లు  విమర్శలను కూడగట్టకుంటూ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈసారి 18 మంది కంటెండర్లను ఎంపిక చేసి.. వారిలో 15 మందిని కంటెస్టెంట్లుగా మార్చే ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న టాస్కులు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి.  రెండో సీజన్ 'అగ్నిపరీక్ష' ఆగస్టు 15 నుంచి ప్రసారం అవుతోంది. అయితే రెండో రౌండ్‌లోనే కంటెస్టెంట్లకు చుక్కలు చూపించే స్థాయిలో టాస్కులు పెట్టడంతో.. 'ఇదే పరిస్థితి అయితే ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి టాస్కులు ఉంటాయో?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

లేటెస్ట్ ఎపిసోడ్‌లో చెత్త టాస్క్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. వారం రోజులుగా కుళ్లిన చెత్త మధ్య దుర్వాసనను భరిస్తూ లాక్‌ ఓపెన్‌ చేసే కీని వెతికి, ఆ తర్వాత అందులోని జ్యూస్‌ను పూర్తిగా తాగాలి. అమన్‌, షాలినీ మధ్య జరిగిన పోరులో స్వల్ప తేడాతో షాలినీ గెలిచి టాప్‌ 15లోకి వెళ్లింది.

 

ఇక మాజీ లవర్‌కు ఫోన్‌ చేసి 'ఐ లవ్యూ', 'సారీ' చెప్పాలనే టాస్క్‌లో శ్రష్టి ముందుకొచ్చి తన గత బంధాన్ని మరోసారి ఎదుర్కొంది. ఆమె ధైర్యాన్ని జడ్జీలు అభిజిత్‌, నవదీప్‌, బిందు మాధవి ప్రశంసించారు. మరోవైపు 'తూ నా బతుకు' అంటూ నుదుటిపై టాటూ వేయించుకునే టాస్క్‌లో కృష్ణ విజయం సాధించాడు. హెయిర్‌కట్‌ టాస్క్‌లో భాగి అబ్బాయిల తరహాలో షార్ట్‌ హెయిర్‌కట్‌ చేయించుకుని టాప్‌ 15లో చోటు సంపాదించింది.

 

అయితే చివర్లో ఎగ్జిట్‌ కార్డుల ట్విస్ట్‌ మరింత ఉత్కంఠకు తెరలేపింది. హేమంత్‌, వెంకటేశ్‌ ఇద్దరూ ఎగ్జిట్‌ కార్డులు తీసుకోవడంతో బురద టాస్క్‌ ఆడాల్సి వచ్చింది. ఇందులో హేమంత్‌ గెలవగా.. వెంకటేశ్‌ షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం 7 గురు టాప్ 15కి చేరుకోగా, 13 మంది హోల్డ్‌లో ఉన్నారు.

 

మొత్తానికి బిగ్‌బాస్‌ ప్రారంభానికి ముందే ‘అగ్నిపరీక్ష 2’లోనే ఇంత రచ్చ ఉంటే.. అసలు బిగ్‌బాస్‌ హౌస్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో 'బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి ఇలాంటి టాస్కులు ఎందుకు?' అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల మానసిక స్థైర్యం, వ్యక్తిత్వం, శారీరక సామర్థ్యాన్ని పరీక్షించడం వరకు ఓకే కానీ.. ఇలాంటి దిగజారుడు, చెత్త టాస్కుల వల్ల బిగ్ బాస్ హౌస్‌లో ఆడే శారీరక, మానసిక సామర్థ్యానికి ఏం సంబంధం? అంటూ కొందరుప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10పై ఉన్న క్రేజ్‌ను 'అగ్నిపరీక్ష 2' మరింత పెంచుతుందా? లేక వివాదాలకే కేంద్రంగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..