బర్త్‌‌ డే పార్టీలో గంజాయి కలకలం..మ్యాంగో వుడ్ ఫామ్‌‌హౌస్‌‌పై పోలీసుల దాడి

బర్త్‌‌ డే పార్టీలో గంజాయి కలకలం..మ్యాంగో వుడ్ ఫామ్‌‌హౌస్‌‌పై పోలీసుల దాడి
  • ఒకరికి పాజిటివ్‌‌ 
  • చేవెళ్ల పరిధిలోని 47 ఫాంహౌస్​లలో తనిఖీలు 

చేవెళ్ల, వెలుగు : మొయినాబాద్ మండలం కనకమామిడి శివారులోని మ్యాంగో వుడ్ ఫామ్‌‌హౌస్‌‌లో నిర్వహించిన ఓ బర్త్​డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి గంజాయి, మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఎస్సై వెంకన్న తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.

 విల్లా నంబర్‌‌ 13లో ఉన్న ఆరుగురిలో ఐదుగురికి పరీక్షలు చేయగా, బిహార్‌‌కు చెందిన డ్యాన్స్ టీచర్ బిషు కుమార్‌‌ (25)కు పాజిటివ్‌‌ వచ్చింది. తాను 5 నెలల కింద మనీష్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొని వినియోగిస్తున్నట్లు బిషు తెలిపాడు. అయితే,  బర్త్‌‌డే పార్టీకి గంజాయి తీసుకురాలేదని చెప్పాడు.

 మరిన్ని ఫాంహౌస్​లలో తనిఖీలు 

చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ మల్లికార్జున్ రెడ్డి, డీఐ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మ్యాంగో వుడ్​ ఫామ్‌‌హౌస్‌‌తో పాటు తోలుకట్టలోని వన్ వ్యూ, వనం, ప్రణవిల్లా, సురంగల్‌‌లోని జెడ్, రాయల్ వుడ్ ఫాంహౌస్​తో పాటు 47 ఫామ్‌‌హౌస్‌‌లలో సోదాలు నిర్వహించారు. 26 లీటర్ల అక్రమ మద్యం, హుక్కా పాట్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ముడిమ్యాల్ లోని ఎలైట్ ఫామ్‌‌హౌస్‌‌లో హుక్కా కొడుతున్న ముగ్గురితో పాటు యజమాని మహమ్మద్ అబ్దుల్ హకీమ్ పై కేసు నమోదు చేశారు.   

ముగ్గురు మైనర్లు పట్టివేత

చేవెళ్ల మార్కెట్ యార్డు వద్ద గంజాయి తీసుకుంటున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని విచారించారు. డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్‌‌గా వచ్చింది. వారిలో ఒకరి వద్ద 12.55 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, నంబర్ ప్లేట్ లేని స్కూటర్‌‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురూ17 ఏళ్ల మైనర్లని, పోలీసులు తెలిపారు.