అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..? ' లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నారంటూ టార్గెట్!

అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..? ' లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నారంటూ టార్గెట్!

ముంబై చిత్ర పరిశ్రమను వరుస బెరింపులతో వణికిస్తోంది లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్. ఇన్నాళ్లు సల్మాన్ ఖాన్, కపిల్ శర్మ వంటి వారిని టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ పై గురిపెట్టినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ను సైతం హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు బాలీవుడ్ తోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అమీర్ ఖాన్‌ కు బెదిరింపులు..

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆడియో క్లిప్‌లో ఒక వ్యక్తి తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన టైసన్ బిష్ణోయ్ గా పరిచయం చేసుకున్నాడు. దేశంలో స్టార్‌డమ్ పేరుతో 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నారంటూ అమీర్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. సనాతన ధర్మానికి, మన సంస్కృతికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని ఎంతమాత్రం సహించం. త్వరలోనే తగిన బుద్ధి చెబుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రాజకీయ నాయకులకు హెచ్చరిక..

అంతేకాదురాజస్థాన్‌లోని శ్రీగంగనగర్‌లో ఒక బాలికపై జరిగిన దారుణాన్ని ప్రస్తావిస్తూ.. నిందితులను కాపాడుతున్న రాజకీయ నాయకులకు కూడా ఇందులో తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వైరల్ పోస్ట్‌పై ముంబై పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ ఆడియో క్లిప్ నిజమైనదేనా? లేక కావాలనే ఎవరైనా సృష్టించారా? అనే కోణంలో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ బెదిరింపులపై అమీర్ ఖాన్ బృందం కానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ తన భార్య గౌరీతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ నిర్వహించనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, అమీర్ ఖాన్ పేరు కూడా ఈ వివాదంలో వినిపించడం బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు వైరల్ అవుతున్న పోస్టులు, ఆడియో క్లిప్‌లపై ఎలాంటి నిర్ధారణకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.