హైదరాబాద్లో పాదయాత్ర చేస్త.. ‘సర్’పై కాంగ్రెస్, కాక్రోచ్ పార్టీల రాద్ధాంతాన్ని ఎండగడతాం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్లో పాదయాత్ర చేస్త.. ‘సర్’పై కాంగ్రెస్, కాక్రోచ్ పార్టీల రాద్ధాంతాన్ని ఎండగడతాం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  • నవంబర్​ 1న చేపడుతం
  • మూడు, నాలుగు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు 

హైదరాబాద్, వెలుగు: సర్ అంశంపై రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ఇతర కాక్రోచ్ పార్టీలు చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రకటించారు. ఈ పార్టీల తీరును, వారి కుట్రలను ప్రజల్లో నిలదీసేందుకు నవంబర్ 1న హైదరాబాద్ లో తానే పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ డ్రామాలను తిప్పికొట్టేందుకు కార్యాచరణను ముమ్మరం చేస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో అన్ని జిల్లాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ భేటీలో జిల్లాల వారీగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను ఖరారు చేస్తామన్నారు.

త్వరలోనే అభ్యర్థుల ప్రకటన 

మరో మూడు, నాలుగు రోజుల్లో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు బీజేపీ స్టేట్ చీఫ్ తెలిపారు. ఈ నెల24న  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ సునీల్ బన్సల్ తెలంగాణకు రానున్నారని, ఆయన సమక్షంలో జరిగే ముఖ్య నేతల సమావేశం అనంతరం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. 

ఈ నెల 24న ఉదయమే ఎమ్మెల్సీ ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను అధిష్టానం పరిశీలన కోసం ఢిల్లీకి పంపిస్తామని పేర్కొన్నారు. నాన్ పార్టీ ఆశావహుల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని, ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని  తేల్చిచెప్పారు.