దేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ ఒకే వేదికపై కలుసుకోవడం అనేది ఒక కలలానే భావిస్తుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ నిష్కల్మషమైన వ్యక్తిత్వంతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా నాయకులందరినీ ఆత్మీయంగా కలిపే కార్యక్రమమే అలయ్ బలయ్.
మనసారా మాట్లాడుకోవడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప పండుగ అలయ్ బలయ్. ప్రపంచంలో మానవ విలువలు కనుమరుగవుతున్నవేళ, మనుషులుగా మనం ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అందరం కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరి మధ్య సోదరభావం వెల్లివిరియాలని సంకల్పిస్తూ 2005లో దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కులమతాలకు అతీతంగా, ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, దేశ నలుమూలల నుంచి అతిథులను ఆహ్వానిస్తూ, కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా మనుషులమని, మనమంతా భారతీయులమని చాటిచెప్పే కార్యక్రమమే అలయ్ బలయ్. తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో కనిపించే కులమతాలకు అతీతమైన ఐక్యతను, అందరూ కలిసిమెలిసి జీవించే గొప్ప సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం ఇది.
రాజకీయాల్లో ఉన్నవారు ఒకరికొకరు శత్రువులు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులేనని కళ్లకు కట్టినట్లు చూపించే కార్యక్రమం అలయ్ బలయ్. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అందరూ ఆత్మీయంగా మెలగాలని, కిందిస్థాయి కార్యకర్తలు సైతం రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించాలని చాటిచెప్పే వేదిక అలయ్ బలయ్.
తెలంగాణ సంస్కృతికి దర్పణం
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సైతం అందరు నాయకులను ఒకే చోటకు తీసుకువచ్చి, ప్రాంతాలుగా విడిపోయినా మనమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పిన కార్యక్రమం అలయ్ బలయ్. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తూ, దసరా పండుగ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించే వేడుక అలయ్ బలయ్.
తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే ఎన్నో రకాల సంప్రదాయ వంటకాల రుచులను అందరికీ పరిచయం చేస్తూ ఆత్మీయతను పంచే వంటల పండుగ అలయ్ బలయ్. దేశంలోని అతిరథ మహారథులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి చేర్చి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే మహత్తర కార్యక్రమం అలయ్ బలయ్. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, మానవ సంబంధాలకు, భారతీయ సంస్కృతికి సోదరభావానికి పెద్దపీట వేస్తూ ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు నిర్వహించేదే అలయ్ బలయ్. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ ఆత్మీయ వేడుక జరగనుంది. అందరూ ఆహ్వానితులే.
- మునుకుంట్ల మనోహర్
బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర
అదనపు కార్యదర్శి
