బాబీ డియోల్ లీడ్ రోల్‌లో విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘బందర్’. గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక డార్క్ అండ్ రా గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇందులో సమర్ మెహ్రా అనే ఫేడవుట్ అవుతున్న పాప్ స్టార్‌గా బాబీ డియోల్ కనిపించాడు. ఓవైపు తగ్గిపోతున్న స్టార్‌డమ్, మరోవైపు ఒంటరితనం, ఇమేజ్ సమస్యలతో సతమతమవుతున్న ఈ సెలబ్రిటీకి ఓ డేటింగ్ యాప్ ద్వారా సప్నా పబ్బి పరిచయం అవుతుంది.
ఆ తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోతుంది. సమర్‌పై ఆమె రేప్, బ్లాక్‌మెయిల్, బెదిరింపులు లాంటి ఆరోపణలు చేయడంతో జైలుకు వెళ్తాడు. తను నిర్దోషినని, ఆమె కావాలనే తనపై ఆరోపణలు చేస్తోందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోరు. చట్టంలోని లొసుగులతో ఆమె అతన్ని ఎలా ఇరికించింది, అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమాపై ఆసక్తిని రేపుతోంది.
ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. సన్యా మల్హోత్రా, సబా ఆజాద్, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి, రిద్ధి సేన్, ఇంద్రజిత్ సుకుమారన్, నగేష్ భోంస్లే ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జూన్ 5న విడుదల కానుంది.
