మనసు చెప్పింది వినాలా .. వద్దా.. అందుకే నాకు నచ్చిన కెరీర్‌‌ని ఎంచుకున్నా : బర్ఖా సింగ్

 మనసు చెప్పింది వినాలా .. వద్దా.. అందుకే నాకు నచ్చిన కెరీర్‌‌ని ఎంచుకున్నా : బర్ఖా సింగ్

చదువు పూర్తయ్యాక కెరీర్​ ఎంచుకోవాలనుకున్నప్పుడు చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న మనసు చెప్పింది వినాలా? వద్దా? అని. ఆ విషయంలో కొందరు వెనకడుగువేసినా ఇలాంటి టాలెంటెడ్​, గట్స్ ఉన్న వ్యక్తులు మాత్రం మనసు చెప్పింది విని అందులోనే సక్సెస్​ అవుతారు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా.. ఈమె బాలీవుడ్​ నటి బర్ఖా సింగ్. చిన్నప్పుడే చైల్డ్​ ఆర్టిస్ట్​గా వెండితెరపై అలరించిన చిన్నారి.. ఇప్పుడు అదే స్క్రీన్​పై రకరకాల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. 

ఒకసారి నటన రంగంలోకి అడుగుపెట్టాక తిరిగి వెనక్కి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ అక్కడ నిలదొక్కుకోవడం కాస్త కష్టమే. మరీ ముఖ్యంగా చైల్డ్​ ఆర్టిస్ట్​లు.. చిన్నప్పుడు ఎప్పుడో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నా.. పెద్దయ్యాక ఒక యాక్టర్​గా ప్రూవ్ చేసుకోవాలంటే, అదీ ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేనివాళ్లైతే పెద్ద సాహసమే చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. జాబ్​ ఆఫర్ లెటర్ చేతిలో పెట్టుకుని, మనసుకు నచ్చిన కెరీర్​ని ఎంచుకునే ధైర్యం చేయడం మరొక ఎత్తు. ఇవన్నీ ఎదుర్కొని ప్రస్తుతం సక్సెస్​ఫుల్ యాక్ట్రెస్​గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బర్ఖా జర్నీ ఇది. 

బ ర్ఖా సింగ్.. రాజస్థాన్​లోని బికనీర్​లో పుట్టింది. ముంబైలోని సెయింట్​ జేవియర్ కాలేజీ, బెర్కెలీలోని బెర్కెలీ యూనివర్సిటీలో చదివింది. డిగ్రీలో మాస్​ మీడియా చేసిన ఆమె, ఎం.ఎ సోషియాలజీ పూర్తి చేసింది. నాలుగేండ్ల వయసులోనే చైల్డ్​ ఆర్టిస్ట్​గా వెండితెరపై కనిపించింది. ఆమె మొదట స్క్రీన్​ పై కనిపించిన చిత్రం 2002లో వచ్చిన ‘ముజ్​సే దోస్తీ కరోగె’. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. 

కొన్నాళ్లు నటనకు బ్రేక్​ తీసుకున్న బర్ఖా 2013లో తిరిగి యాక్టింగ్ కెరీర్ రీస్టార్ట్ చేసింది. కాకపోతే ఈసారి సిల్వర్ స్క్రీన్​ కాకుండా బుల్లితెరకు పరిచయం అయింది. కాలేజీ చదువు పూర్తయ్యేటప్పటికి ఆమెకు 21 ఏండ్లు. ఆ టైంలో టీవీ సీరియల్స్​లో అవకాశం రావడంతో యాక్టింగ్​ని ప్రొఫెషన్​గా తీసుకున్నట్టు చెప్పింది. మొదట‘యే హై ఆషిఖీ’ అనే సీరియల్​లో నటించింది. మధ్యమధ్యలో కమర్షియల్ యాడ్స్, షార్ట్​ ఫిల్మ్స్​లోనూ నటించిందామె. ఇప్పటివరకు నటించిన వాటిలో చివరి సినిమా 2024 వచ్చిన ‘ది సబర్మతీ రిపోర్ట్‌‌’. లేటెస్ట్​గా ‘లఫంగే’ అనే వెబ్ సిరీస్​లో నటించిన ఆమె జర్నీలో ఇంట్రెస్టింగ్​ సంగతులివి.

రెండూ ఒకేసారి

నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీల్లో కూడా అన్నింట్లో యాక్టివ్​గా పార్టిసిపేట్ చేసేదాన్ని. స్టూడెంట్​గా ఉన్నప్పటినుంచి కూడా నటనని అందరిలా ఎక్స్​ట్రా యాక్టివిటీలా చూసేదాన్ని కాదు. యాక్టింగ్​ని చాలా సీరియస్​గా తీసుకునేదాన్ని. అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్ చేయాలా? లేక నాకు నచ్చిన యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవాలా? అని ఆలోచిస్తున్న టైం అది. ఒకరోజు కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. అప్పటికే టీవీ సీరియల్​ ఆఫర్ వచ్చింది. కానీ ఇంకా ఓకే చేయలేదు. అదే రోజు ఫైనల్​గా నా నిర్ణయం చెప్పాల్సి ఉంది. అప్పుడు బాగా ఆలోచించాను. నా మనసుకు నచ్చిన కెరీర్​నే ఎంచుకున్నాను. అలా టీవీ సీరియల్స్​తో మళ్లీ నటన మొదలుపెట్టాను. 

వెబ్​ సిరీస్​లతో కొత్త మలుపు

2018లో నా కెరీర్​ మరో మలుపు తీసుకుంది. ‘కైసీ యే యారియాన్’ అనే వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చా. అదే ఏడాది పలు వెబ్​ సిరీస్​ల్లో నటించా. తర్వాత 2022లో వచ్చిన మసాబా మసాబా, ఈ ఏడాది రిలీజ్ అయిన క్రిమినల్ జస్టిస్​ : ఏ ఫ్యామిలీ మ్యాటర్ వంటి సిరీస్​లతో ఓటీటీ ఆడియెన్స్​కు దగ్గరయ్యా. అయితే ఇటు వెబ్​ సిరీస్​లు చేస్తున్నప్పటికీ తిరిగి నన్ను వెండితెరపై చూసుకోవాలనే తపన నాలో ఎప్పుడూ ఉండేది. అందుకే 2019లో ‘హౌజ్ అరెస్ట్’​ అనే సినిమా ఆఫర్ రాగానే ఒప్పుకున్నా. అప్పటినుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ రంగంలో నా స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చా.

స్ట్రీట్ ఫుడ్ ఇష్టం

నేను ముంబైలోనే పెరిగాను. అక్కడి వీధుల్లో తిరిగాను. స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేశాను. ఇప్పటికీ నాకు ఆ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నిజానికి అది టేస్ట్​ మాత్రమే కాదు.. అదొక గొప్ప అనుభూతిగా ఫీలవుతాను. స్ట్రీట్ ఫుడ్ తినడానికి ముంబై వీధుల్లోకి వెళ్తే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇదే కాదు.. నా లైఫ్ స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్ కూడా సింపుల్​గానే ఉంటుంది. సినిమాలు ఎంచుకోవడంలో కూడా ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనపడాలనుకోను. ఏ పాత్ర వచ్చినా నాకు నచ్చితే చేస్తా. కాస్త డిఫరెంట్​గా ఉండాలి అని కోరుకుంటానంతే. 

ఈ జర్నీలో.. 

 సరైన వ్యక్తులు పరిచయమవ్వడం, సరైన ఆడిషన్​కి వెళ్లడంలో వచ్చే సవాళ్లు ఎన్నో. వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్తే అక్కడ మనం పాస్​ అవ్వాలి. అలా అవకాశం చేతికొచ్చాక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేవరకు హార్డ్ వర్క్ చేయాలి. ఈ జర్నీలో ఉండే సవాళ్లు, సమస్యలు చాలామందికి తెలియదు. ఫైనల్​గా ఆ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకుంటున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. 

ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ముందు నేనెంతో కష్టపడ్డాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని రిజెక్షన్స్ చవిచూశాను. ఇలా నానావిధాలుగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇన్నేండ్లలో ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అనుభవమున్న యాక్టర్స్​తో నటించేటప్పుడు కొన్ని స్కిల్స్ నేర్చుకున్నా. సెట్​లో ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నా. యాక్షన్​కి, కట్​కి మధ్య ఏం జరుగుతుందనేది తెలిసింది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్​కి నేనిచ్చే సలహా ఒక్కటే.. మీమీద మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ టైం కష్టపడండి. ఏదేమయినా సరే కాన్ఫిడెన్స్​తో ముందుకెళ్లండి. 

టీవీలో అందుకే మానేశా

2013 నుంచి 2017 వరకు సీరియల్స్​లో కంటిన్యూగా యాక్టింగ్ చేశా. ఆ తర్వాత నాకు ఆఫర్ చేసే పాత్రలతో అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అలాగే నా ఆలోచనకు తగ్గట్టు నాకు నచ్చే కథలు లేదా పాత్రలు టెలివిజన్​లో రాలేదు. అందుకే టీవీ సీరియల్స్​లో నటించడం మానేశా. నా ఆలోచనలకు ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్ బాగా రిలేట్ అయింది. అందుకని, నాకు కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ వచ్చేవరకు నేను టీవీలో నటించకూడదు అనుకున్నా. అలాగని నేను ఖాళీగా కూర్చోవాలి అనుకోను. పని చేయాలనే తపన చాలా ఉంది. నేను చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటాను.