క్యాన్సర్ నుంచి ఈ సెలబ్రెటీలు ఎలా బయటపడ్డారు..? కేవలం మెడిసిన్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గదు !

క్యాన్సర్ నుంచి ఈ సెలబ్రెటీలు ఎలా బయటపడ్డారు..?  కేవలం మెడిసిన్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గదు !

క్యాన్సర్..​ ఇది శారీరక రోగం మాత్రమే కాదు. మానసికంగా కూడా మనిషిని కుంగదీసే జబ్బు. శరీరానికి సరైన మందు లేదా వైద్యం ఎంత ముఖ్యమో, మనసుకు కూడా అంతే ముఖ్యం అని తెలిపే వ్యాధి. చాలామంది క్యాన్సర్​ను జయించినవాళ్లు చెప్పేది కూడా ఇదే. కేవలం శరీరానికి మెడిసిన్ తీసుకోవడం కాదు.. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోగలం అని.

అలాగని ప్రతి ఒక్కరి జర్నీ ఒకేలా ఉండదు కదా.. కొందరికి డబ్బు ఉండి, సరైన వైద్యం దొరకదు. వేరొకరికి వైద్యం అందుబాటులో ఉన్నా ట్రీట్​మెంట్ చేయించుకోలేని నిస్సహాయత. కొంతమందికి డబ్బుండి, వైద్యం అందుతున్నప్పటికీ మనసులో ఏమైపోతానో అనే దిగులు లోలోపలే చంపేస్తుంది. అలాంటి పరిస్థితులను జయించి కోలుకున్నవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ.

అందుకే “United by Unique” అనే థీమ్ను తీసుకొచ్చారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా..
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, దానిని నివారించడం, వ్యాధి గుర్తింపు, చికిత్స వంటి అంశాలపై మాట్లాడతారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) నాయకత్వంలో జరిగే ఈ అంతర్జాతీయ ఉద్యమం, క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి ప్రజలు, సంఘాలు, ప్రభుత్వాలు, సంస్థలు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిస్తుంది.

మూడేళ్ల క్యాంపెయిన్‌‌‌‌కు థీమ్‌‌‌‌గా “యునైటెడ్‌‌ బై యునీక్‌‌”ని ఎంచుకున్నారు. గతేడాదే ఈ థీమ్ మొదలైంది. 2027 వరకు కొనసాగనుంది. ఈ థీమ్​.. క్యాన్సర్ అనుభవం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుందని, అయితే అందరం ఐక్యంగా ఉండి దానిని ఎదుర్కోవాలని సూచిస్తుంది. క్యాన్సర్ కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, ప్రతి రోగి జీవితంలో ఒక ప్రత్యేకమైన కథ. ఆ కథలను గుర్తించి, సంరక్షణ అందించడమే ఈ థీమ్ లక్ష్యం.

ఐక్యత అవసరం
క్యాన్సర్ వస్తే శారీరక నొప్పిని అనుభవిస్తూనే మానసిక, భావోద్వేగ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరికి కుటుంబం మద్దతు బలం ఇస్తుంది. మరొకరిలో ఒంటరితనం భయాన్ని పెంచుతుంది. కొందరు ట్రీట్​మెంట్​ వల్ల ఉపశమనం పొందుతారు. ఒకరి జీవితంలో క్యాన్సర్ మనోధైర్యాన్ని నింపుతుంది. మరొకరికి దుఃఖాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. 

ఈ వైవిధ్యమే ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా (unique) చేస్తుంది. కానీ ఈ ప్రత్యేకతల మధ్య ఒక సామాన్య లక్ష్యం ఉంది. అదేంటంటే.. క్యాన్సర్ నుంచి బయటపడాలని లేదా దానితో జీవిస్తూ నాణ్యమైన జీవితం గడపాలని. అది అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఈ థీమ్​ ప్రత్యేకతలను గౌరవిస్తూ, ఐక్యంగా నిలబడాలి అని చెప్తోంది. ఈ థీమ్​ ద్వారా 2025లో ప్రజల కథలను పంచుకోవడం, అవగాహన పెంచడం వంటివి చేశారు.

ఇది రెండో దశ.. ఈసారి ఆ కథలను ఆధారంగా చేసుకుని నిజ జీవితంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్యాన్సర్ సంరక్షణ వ్యవస్థలు ప్రతి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. వైద్యులు, నర్సులు, కుటుంబసభ్యులు, సమాజం.. ఇలా అందరూ కలిసి మనల్ని మనం కాపాడుకోవాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగికి రవాణా, ఆర్థిక సాయం అవసరం అవుతుంది. యువతకు మానసిక ధైర్యాన్నిచ్చేవాళ్లు, ఉద్యోగ భద్రత కల్పించడం ముఖ్యం. వృద్ధులకు ఇంటి దగ్గర ట్రీట్​మెంట్ చేస్తూ, వాళ్ల బాగోగులు చూసుకోవడం. ఇలాంటి రకరకాల అవసరాలను గుర్తించి ఆరోగ్య వ్యవస్థలు కూడా స్పందించాలి.

క్యాన్సర్​ రోగులను దాన్నుంచి విముక్తి చేసేందుకు మనం ఏం చేయగలం? ఎలా భాగస్వాములం కావాలి అంటే మన చుట్టూ ఉన్న క్యాన్సర్ రోగుల కథలను వినండి, పంచుకోండి. క్యాన్సర్ నివారణ గురించి అవగాహన పెంచండి. సమయానికి స్క్రీనింగ్ టెస్ట్​ చేయించుకోవడం లేదా చేయించడం ద్వారా సాయాన్ని అందించొచ్చు. వీలైతే స్థానిక సంస్థలు, ఆసుపత్రులు, ఎన్​జీవోలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. సోషల్​ మీడియాలో #UnitedByUnique, #WorldCancerDay హ్యాష్‌‌‌‌ట్యాగ్‌‌‌‌లతో మీ మెసేజ్​ షేర్ చేసుకోండి.

క్యాన్సర్ మనల్ని మనవాళ్ల నుంచి వేరు చేయదు. అది మనల్ని ఐక్యం చేస్తుంది. ప్రతి ఒక్కరి ప్రత్యేకతను గౌరవిస్తూ, అందరం కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తే క్యాన్సర్ రహిత ప్రపంచం సాధ్యమే. మనవాళ్లను కాపాడుకోవడం కోసం ఐక్యంగా మార్పు తీసుకొద్దాం! 

* క్యాన్సర్ నా దృక్పథాన్ని మార్చింది. ఇప్పుడు ప్రతి రోజు మరింత బలంగా, సానుకూలంగా జీవిస్తున్నాను.

మనీషా కోయిరాలా

* ఈ సవాలును నేను అవకాశంగా తీసుకున్నా.
నా జీవితాన్ని మళ్లీ రీ- ఇన్వెంట్ చేసుకోవడానికి. పాజిటివిటీని నా మొదటి టూల్‌‌‌‌గా ఎంచుకున్నా. జీవితం ముగిసిపోయిందని అనుకోకండి... దీన్నెలా చూస్తారో అదే ముఖ్యం.

హీనా ఖాన్

* ఈ రోజు మంచిది. రేపు మరింత మంచిది అవుతుంది. క్యాన్సర్ నన్ను నిర్వీర్యం చేయలేదు. మరింత బలపరిచింది.

మమతా మోహన్​దాస్ 

* జీవితం ఏమిచ్చినా నేను బాధితురాలిగా ఉండను. భయం, నిరాశావాద దృక్పథం, నెగటివిటీ నన్ను ఆధీనం చేసుకోనివ్వను. నేను ఓడిపోను!

హంసానందిని

* క్యాన్సర్ నా జీవితంలో ఒక బహుమతిలా వచ్చింది. నా దృష్టి మరింత స్పష్టమైంది. మనసు పరిశుద్ధంగా మారింది.

గౌతమి

* మరణం గురించి ఆలోచనరాలేదు. ఇది ఒక పెద్ద పోరాటమని తెలిసి ఎదుర్కొన్నాను.

సోనాలి బింద్రే