- సౌదీ అరేబియాపై దాడులతో 3 శాతం అప్
- భారతీయుడు సహా మరొకరి మృతి.. ఇద్దరికి గాయాలు
- దమ్మామ్ కింగ్ ఫహద్ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లు
- ఆరామ్‌కో షాయ్‌బా చమురు క్షేత్రంపైనా డ్రోన్ అటాక్
- ఈ ఘటనలో మరో ఇద్దరు విదేశీయుల మృతి
- సౌదీలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న ఎంబసీ
రియాద్: సౌదీ అరేబియాలోని దమ్మామ్ సిటీలో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు బుధవారం రాత్రి మిసైల్స్, డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక ఇండియన్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ విషయాన్ని రియాద్ లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంబసీ.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని వెల్లడించింది.
సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. కింగ్ ఫహద్ విమానాశ్రయ దాడిలో ఒక సౌదీ పౌరుడు, ఒక భారతీయ నివాసి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇద్దరు భారతీయులతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన వారు కూడా గాయపడ్డారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. విమానాశ్రయంలో నష్టాన్ని అంచనా వేసి భద్రతా చర్యలు తీసుకున్నామని.. ప్రస్తుతం విమాన రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని సౌదీ అధికారులు తెలిపారు.
చమురు క్షేత్రంపై కూడా డ్రోన్ దాడి
ఇదే సమయంలో సౌదీ ఆరామ్ కో సంస్థకు చెందిన షాయ్‌బా చమురు క్షేత్రంపై కూడా హౌతీలు డ్రోన్ దాడి చేశారు. అయితే, సౌదీ వాయు రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్‌ను అడ్డగించి కూల్చివేసింది. దాడిలో పడిన శకలాలు తగలడంతో ఫిలిప్పీన్, నేపాల్ జాతీయులు ఇద్దరు మృతి చెందగా, ఒక ఇండియన్‌తో పాటు పాక్ పౌరుడు గాయపడ్డాడు.
చమురు క్షేత్రంలో మంటలు చెలరేగినప్పటికీ ఉత్పత్తికి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. అక్టోబర్ 11న కూడా ఇదే దమ్మామ్ విమానాశ్రయం లక్ష్యంగా దాడి జరిగిందని, అలాగే ఈ నెల ప్రారంభంలో రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలోనూ ఒక భారతీయ పౌరుడు మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఖండించిన భారత్
సౌదీలో పౌర సౌకర్యాలపై హౌతీలు జరుపుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. తక్షణమే దాడులను చర్చలతో ముగించాలని పిలుపునిచ్చింది. సౌదీ అరేబియాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సుమారు 2.74 మిలియన్ల (దాదాపు 27 లక్షలకు పైగా) మంది భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది.
స్థానిక ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని, దాడుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే (ఇళ్లలోనే) తలదాచుకోవాలని కోరింది. డ్రోన్ లేదా క్షిపణి దాడులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సౌదీ చట్టాల ప్రకారం నేరమని, దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.
