పెళ్లింట విషాదం: కారు ప్రమాదంలో పెళ్లి కూతురు, తండ్రి మృతి

పెళ్లింట విషాదం: కారు ప్రమాదంలో పెళ్లి కూతురు, తండ్రి మృతి

నిర్మల్ జిల్లా  కడెం మండలం పాత మద్దిపడకలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పచ్చటి తోరణాలతో కళకళలాడిన ఇంట్లో ఆ సంతోషం మూన్నాళ్లు కూడా నిలవలేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజు రిసెప్షన్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరిగి పెళ్లి కూతురు, ఆమె తండ్రి మరణించారు. ఈ ప్రమాద ఘటన వధూవరుల కుటుంబాలను ఒక్కసారిగా పెను విషాదంలోకి నెట్టేసింది.

పాత మద్దిపడక గ్రామానికి చెందిన మౌనికకు, మహారాష్ట్రలోని బల్లార్ష రాజురా గ్రామానికి చెందిన వ్యక్తితో ఈ నెల 25న పెండ్లి జరిగింది. ఆ తర్వాత పెండ్లి కుమారుడి ఊరిలో రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా పాండవాపూర్ సమీపంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెండ్లి కుమార్తె మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా డ్రైవర్ నిద్ర మత్తులో కన్ను రెప్ప వాల్చడంతో కారు సడన్‌గా అదుపు తప్పి లోయలో పడిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.