- నోవో సంస్థకు చెందిన వెగోవీ పిల్‌కు గ్రీన్ సిగ్నల్
- యూరప్‌లో ఒబెసిటీ ఓరల్ చికిత్సకు
- అనుమతిచ్చిన తొలి దేశంగా యూకే
- ఇంజెక్షన్ల భయం ఉన్నవారికి
- ప్రత్యామ్నాయంగా వెగోవీ పిల్
- మాత్రలోని సెమాగ్లుటైడ్ కెమికల్ వల్ల
- తక్కువ తిన్నా కడుపు నిండిన భావన
లండన్: అధిక బరువుతో బాధపడే వారి కోసం బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శరీర బరువును తగ్గించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ తయారు చేసిన కొత్త మాత్ర 'వెగోవీ పిల్'కు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు బరువు తగ్గడానికి వారానికి ఒకసారి ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రోజూ ఉదయం పరగడుపున, ఆహారానికి అరగంట ముందు వెగోవీ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.
ఇంజెక్షన్లు అంటే భయపడే వారికి వెగోవీ పిల్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారనుందని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ(బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటర్) పేర్కొంది. వెగోవీ పిల్ కు ఇచ్చిన ఆమోదంతో యూరప్ దేశాల్లో వెయిట్ లాస్ కోసం ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) చికిత్సకు అనుమతిచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది.
- వెగోవీ పిల్ ఎలా పనిచేస్తుందంటే..!
వైద్య నిపుణుల ప్రకారం..వెగోవీ పిల్లో ‘సెమాగ్లుటైడ్’ అనే రసాయనం ఉంటుంది. ఇది మన ప్రేగులు సహజంగా విడుదల చేసే జీఎల్పీ-1 హార్మోన్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. బరువు తగ్గేందు కోసం వెగోవీ పిల్ వేసుకున్నప్పుడు.. సెమాగ్లుటైడ్ మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై పనిచేసి, మనం తక్కువ తిన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఈ మాత్ర జీర్ణాశయం ఖాళీ అయ్యే ప్రక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా ఆహారం తిన్న తర్వాత ఎక్కువ సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది.
ఇవి బరువు తగ్గించడానికే కాకుండా.. గుండెజబ్బులు, బీపీ, కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. మార్కెట్లో ఇప్పటికే ‘వెగోవీ (బరువు తగ్గడానికి), ఓజెంపిక్ (షుగర్ వ్యాధికి)’ అనే ఇంజెక్షన్లలో కూడా సెమాగ్లుటైడ్ కెమికల్ వాడుతున్నారు. కానీ, వీటిని వాడుతున్న సమయంలో వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అలాగే, వైద్యుల ప్రిస్క్రిప్షన్, పర్యవేక్షణ లేకుండా వీటిని సొంతంగా వాడటం ప్రాణాంతకం కావచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ మాత్రలు వాడుతున్నంత కాలమే బరువు అదుపులో ఉంటుంది. మందులు ఆపేసిన తర్వాత సరైన పోషకాహారం తీసుకోకపోతే.. శారీరక వ్యాయామం చేయకపోతే మళ్లీ పాత బరువుకు వచ్చే ప్రమాదమూ ఉంది. కాబట్టి, శాశ్వత ఫలితాల కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
- వెయిట్ లాస్ మెడిసిన్ మార్కెట్ స్పీడప్
బ్రిటన్‌లో ఊబకాయం(ఒబెసిటీ)తో ఇబ్బంది పడుతున్న దాదాపు ఒక కోటి మందికి పైగా బాధితులకు వెగోవీ పిల్ ఎంతో ఉపయోగపడనుంది. అమెరికాలో ఈ ఏడాది ప్రారంభంలోనే వెగోవీ మాత్ర అందుబాటులోకి రాగా.. దీనికి పోటీగా ‘ఎలి లిల్లీ’ అనే మరో సంస్థ కూడా ‘ఫౌండాయో’ పేరుతో తన సొంత ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి తెచ్చింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా వెయిట్ లాస్ మెడిసిన్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతున్నది. 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ. 8.3 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ధరను నిర్ణయించేది ప్రైవేట్ సంస్థలే..
బ్రిటన్‌లో గతేడాది దాదాపు 24 లక్షల మంది తమ శరీర బరువు తగ్గించుకునేందుకు అనేక రకాల మందులను ఉపయోగించారు. అందులో 2 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ఎస్) ద్వారా ఉచితంగా సేవలు పొందారు. మిగిలిన 22 లక్షల మంది బాధితులు ప్రైవేట్‌గా నెలకు రూ.10 వేలు ఖర్చు పెట్టి మెడిసినట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి వెగోవీ పిల్ కూడా బ్రిటన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు, ఫార్మసీల ద్వారానే అందుబాటులోకి రానుంది.
దీని ధరను ప్రైవేట్ సంస్థలే నిర్ణయించనున్నాయి. ఈ మాత్రను ప్రభుత్వ వైద్య సేవల్లో చేర్చి సామాన్యులకు ఉచితంగా అందించే విషయమై బ్రిటన్ ఆరోగ్య సంస్థ (ఎన్ఐసీఈ) త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. వెగోవీ ట్యాబ్లేట్లు చికిత్సను సులభతరం చేస్తాయని, అయితే ఇవేమీ అన్నింటికీ అద్భుత పరిష్కారాలు చూపవని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును తగ్గించేందుకు వెగోవీ పిల్‌తో పాటు జీవనశైలిలో మార్పులు కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.
