BRS ఆస్తులు రూ.1,509 కోట్లు.. ఒక్క ఏడాదిలోనే ఖర్చు రూ.162 కోట్లు

BRS ఆస్తులు రూ.1,509 కోట్లు.. ఒక్క ఏడాదిలోనే ఖర్చు రూ.162 కోట్లు

హైదరాబాద్: దేశంలోనే రిచెస్ట్ రీజనల్ పార్టీల్లో ఒకటైన బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్‎కు వివిధ రూపాల్లో మొత్తం రూ.1,509 కోట్ల ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకుల్లో నగదు రూపంలో రూ.1,431 కోట్లు, రుణాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల రూపంలో రూ.11.77 కోట్లు, భవనాలు, ఇతరత్రా భౌతిక వస్తు రూపంలో రూ.66.26 కోట్ల ఆస్తులున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ ఆస్తుల వివరాలు 2026, మార్చి 31 నాటికి సంబంధించినవి.

ఆదాయం రూ.114 కోట్లు 

2025-26 సంవత్సరంలో గులాబీ పార్టీ వివిధ రూపాల్లో రూ.114 కోట్లు ఆర్జించింది. ఇందులో డొనేషన్ల రూపంలో రూ.16.44 కోట్లు, రుసుములు చందాల రూపంలో రూ.27.60 లక్షలు, డిపాజిట్లపై వడ్డీలు, అద్దెలు తదితర మార్గాల్లో రూ.97.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆ పార్టీ తెలిపింది.

ఏడాదిలో బీఆర్ఎస్ ఖర్చు రూ.162 కోట్లు

2025-26 ఫైనాన్షియల్ ఇయర్‎లో బీఆర్ఎస్ పార్టీ భారీగా ఖర్చు పెట్టింది. పార్టీ కార్యకలాపాల కోసం ఏడాదిలో రూ.162 కోట్లు వెచ్చించినట్లు ఈసీకి సమర్పించిన ఆడిట్ రిపోర్టులో ఆ పార్టీ తెలిపింది. ఇందులో సాధారణ ప్రచార కార్యక్రమాల కోసం రూ.137 కోట్లు, ఉద్యోగుల వేతనాలకు రూ.1.53 కోట్లు, పరిపాలన, సాధారణ ఖర్చులకు రూ.16.88 కోట్లు, ఇతరత్రా రూపాల్లో రూ.6.84 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది. 

ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ

2025-26 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‎కు రూ.114 కోట్ల ఆదాయం రాగా.. రూ.162 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. అంటే.. ఈ ఫైనాన్షియల్ ఇయర్‎లో బీఆర్ఎస్ ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ. ఆర్థిక సంవత్సరంలో సమకూరిన ఆదాయం కంటే ఇది రూ.48.43 కోట్లు అధికం. రాబడి కంటే ఖర్చు ఎక్కువ కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు రూ.1,551 కోట్ల నుంచి రూ.1,503 కోట్లకు తగ్గింది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రూ.1.60 కోట్లు ఖర్చు

2025, నవంబర్‎లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించిన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులో బీఆర్ఎస్ వెల్లడించింది. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రచారం కోసం బీఆర్ఎస్ ఓవరాల్‎గా రూ.137 కోట్ల ఖర్చు చేయగా.. ఇందులో ప్రకటనల కోసం రూ.53.68 కోట్లు, సాధారణ ప్రచారం కోసం రూ.24.85 కోట్లు, బహిరంగ సభల కోసం రూ.57.51 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. పరిపాలన, సాధారణ వ్యయాల్లో అత్యధికంగా న్యాయ సేవల కోసం రూ.13.39 కోట్లు ఖర్చుచేసినట్లు ఆ పార్టీ పేర్కొంది.