బీఆర్ఎస్ పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం .. ఎల్లూరుకు నీటి విడుదల: మంత్రి జూపల్లి కృష్ణారావు

 బీఆర్ఎస్ పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం .. ఎల్లూరుకు నీటి విడుదల: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లోకి ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 

నార్లాపూర్ నుంచి ఎల్లూరుకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయడం ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం అందనుందని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం వంటి కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయని, రాతి నేల కారణంగా తవ్వకాలకు సమయం పడుతోందని తెలిపారు. ఈ అసంపూర్తి పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.

 అసంపూర్తి పనులన్నింటినీ పూర్తి చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం విజయదశమి సందర్భంగా దుర్గమ్మ తల్లిని, శమీ వృక్షాన్ని, కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చెడుపై మంచి సాధించిన విజయదశమి స్ఫూర్తితో సమాజంలో మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలని, అందరూ ఐక్యమత్యంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.