- సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లీడర్లు, కార్యకర్తల సతమతం
- ఏమున్నా కేటీఆర్ దగ్గరకే పోవాలె
- భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలున్నా కేడర్ లో నో జోష్
- సొంత నియోజకవర్గాలకే తలసాని, పద్మారావు పరిమితం
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించే నాయకుడు లేక స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాజ్అవుతున్నారు. ఇతర పార్టీలు జిల్లాకో అధ్యక్షుడిని నియమించుకుని దూసుకుపోతుంటే..16 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ మాత్రం అధ్యక్షుడి నియామకాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో పార్టీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకే పోవాల్సి వస్తున్నదని, అందరికీ ఆయనను చేరుకునే యాక్సెస్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
పైగా, ఆయనపై పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఉండడంతో తమకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారని లోలోపల కుమిలిపోతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు లాంటి మాస్ లీడర్లు ప్రస్తుతం తమ నియోజకవర్గాలకే పరిమితం కావడంతో గ్రేటర్ లీడర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ అధ్యక్షుల ఆధ్వర్యంలో రోజూ ఏదో ఒక పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు పోతుంటే తమ పార్టీకి మాత్రం నగరానికి నాయకత్వం వహించే నేత లేక కునారిల్లుతున్నదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
2025 జూన్8న మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టు ఖాళీగానే ఉన్నదని, దీంతో పార్టీ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేయడం, నియోజకవర్గాల నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచడం, క్యాడర్లో ఉత్సాహం నింపడం వంటి బాధ్యతలు నిర్వర్తించే వారే కరువయ్యారంటున్నారు.
ఏ చిన్న విషయమైనా కేటీఆర్ వద్దకే...
నగర పార్టీ నాయకులకే కాదు డివిజన్‌స్థాయిలో లీడర్లు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా చివరకు అంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకే వెళ్లాల్సి వస్తున్నదంటున్నారు. ఏ పని ఉన్నా బీఆర్ఎస్ భవన్ కు వెళ్లి కలవాల్సిందేనని, ఒక్కోసారి బిజీ షెడ్యూల్‌వల్ల ఆయన అందుబాటులో ఉండడం లేదంటున్నారు. దీనివల్ల పార్టీలోని సమస్యలు పరిష్కారం కావడం లేదని దిగులు చెందుతున్నారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ల అభ్యర్థిని ప్రకటించలే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇంకా పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమాలంటూ ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు మొదలుపెట్టింది. రెండు రోజుల కిందటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది.
అలాగే, ఒకటి రెండు నియోజకవర్గాల సమన్వయ సమావేశాలను కూడా నిర్వహించింది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందా అని ఆ పార్టీలోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో మరికొంచెం వేగం పెంచి అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తే గ్రేటర్లో పార్టీకి ప్రయోజనం ఉంటుందని స్థానిక లీడర్లు భావిస్తున్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వచ్చే వేళ సిటీలో నడిపించే నాయకుడు లేకపోతే తప్పుడు సంకేతాలు పోతాయని ఆ పార్టీలోని పేరు చెప్పడానికి ఇష్టపడని నేతలు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీస్తే గ్రేటర్లో 16 మంది ఎమ్మెల్యేలు గెలిచి పార్టీని నిలబెట్టారని, అది కొనసాగాలంటే తక్షణం చురుకైన నాయకత్వం కావాలని కోరుతున్నారు. ఖైరతాబాద్‌లోనూ బీఆర్ఎస్ పార్టీనే గెలిచిందని, ఉప ఎన్నికల వస్తున్న వేళ పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి అండగా నిలబడే నాయకుడు లేకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారు.
కార్పొరేటర్ల సీట్ల కోసమూ అక్కడికే..
మూడు కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ల ఎన్నికలకు ఇప్పటి నుంచే డివిజన్లలో నేతలు రెడీ అవుతున్నారు. విలీన ప్రాంతాల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇదివరకు 15 నుంచి 25 మంది వరకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండగా, విలీనం తర్వాత ఒకటి లేదా రెండు డివిజన్లుగా ఏర్పాటయ్యాయి.
దీంతో ఒక్కో డివిజన్లో పోటీ చేయడానికి పదుల సంఖ్యలో లైన్లలో ఉన్నారు. ఇంత మందిలో టికెట్ ఎవరికి వస్తుందో తెలియక వారు ఇప్పటి నుంచే కేటీఆర్ వద్దకు క్యూ కడుతున్నారు. నిత్యం ఎన్నో పార్టీ సమస్యలతో సతమతమవుతున్న ఆయన కార్పొరేటర్ల సీట్ల కేటాయింపు గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరని, అందుకే గ్రేటర్ అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్నారు.
