- సీఎం రేవంత్, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై దాసోజు ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గ్రూప్1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో నంబర్ 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి గ్రూప్-1 అభ్యర్థులను ఎందుకు కలవరని ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి 60 ఉద్యోగాలను కొత్తగా యాడ్ చేసి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో రేవంత్, మహేందర్‌రెడ్డి కలిసి తప్పుడు జీవో తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆ తీర్పు వచ్చే లోపు జీవోను రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలు ఆలస్యమైతే సీఎంకు వచ్చే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.